
'స్మార్ట్ సిటీ మిషన్' కింద నగరాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, మరో 13 సిటీలను భారత ప్రభుత్వం ఎంచుకుంది. అందులో తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ కూడా ఉండడం విశేషం.
జనవరి లో జరిగిన మొదటి రౌండ్ లో మంచి ర్యాంక్ వచ్చిన 23 నగరాలు రకరకాల కారణాల ద్వారా ఎన్నిక కాలేకపోయాయి. అందుకే అందులో నుండి, ఓ 13 నగరాలను, ఇప్పుడు ఎంపిక చేసినట్లుగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. రాయ్ పూర్ (ఛత్తీస్గఢ్), న్యూ టౌన్ కోలకతా, చండీగఢ్, భాగల్పూర్ (బీహార్), పనాజి (గోవా), పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవులు), ఇంఫాల్ (మణిపూర్), రాంచి (జార్ఖండ్), అగర్తల (త్రిపుర), ఫరీదాబాద్ (హర్యానా), లక్ నౌ, ఆ లిస్టులో ఉన్న మరికొన్ని నగరాల పేర్లు.
తాజాగా ప్రకటించిన ఈ 13 నగరాలకు అయ్యే పెట్టుబడి రూ 30.229 కోట్లుగా ప్రతిపాదించారు. దీనితో గతంలో 20, ఇప్పుడు 13, మొత్తంగా 33 నగరాల అభివృద్ధికి కలిపి, పెట్టుబడి రూ .80, 789 కోట్లకు చేరుకుంది, అని వెంకయ్య నాయుడు అన్నారు. 7 రాజధాని నగరాలు - పాట్నా (బీహార్), సిమ్లా (హిమాచల్ ప్రదేశ్), నయా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), ఇటానగర్ (అరుణాచల్ప్రదేశ్), అమరావతి (ఆంధ్ర ప్రదేశ్), బెంగళూరు (కర్నాటక) తిరువంతపురం (కేరళ) - స్మార్ట్ సిటీ మిషన్ కింద అభివృద్ధి చేయాలనుకున్న నగరాల లిస్టులో లేవు. మూడో రౌండులో, ఈ నగరాలను కూడా చేర్చే ఆలోచనలో ఉన్నట్లు వెంకయ్య తెలిపారు.