
విజయ్ మాల్యాను వెనక్కి పంపించాలని యూకేను ఈరోజు భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణం చెల్లించకుండా విజయ్ మాల్యా లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి భారత్ విచారించాల్సి ఉందని, తప్పకుండా మాల్యాను వెనక్కి పంపాలని భారత విదేశాంగ శాఖ బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. విజయ్ మాల్యా మార్చి 2న దేశం విడిచి లండన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరవ్వాలని ఈడీ పలుమార్లు సమన్లు పంపినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది.
విజయ్ మాల్యా 2003లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. సాధారణ ధరలకే భారతీయులకు లగ్జరీ ప్రయాణం అందిస్తామంటూ ప్రారంభించిన ఈ ఎయిర్‌లైన్స్ 2012కల్లా దివాలా తీసి మూతపడింది. మాల్యా పలు బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా లండన్ వెళ్లారు. దీనిపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది.