జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశాలు షురు

జి.ఎస్.టి.బిల్లుకి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడి చట్ట రూపం దాల్చడంతో అది 2017, ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతోంది. ఆరోజు నుంచి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు అవుతుంది. ఈ నూతన పన్ను విధానంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జి.ఎస్.టి. కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. దానిలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్దికమంత్రులు, ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆ జి.ఎస్.టి.కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి డిల్లీలో మూడు రోజులపాటు జరుగుతాయి. వాటికి హాజరయ్యేందుకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ డిల్లీ వెళ్ళారు. వివిధ ఉత్పత్తులపై ఎంతెంత పన్ను విధించాలనే దానిపై ఈ సమావేశాలలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

ఈ నూతన విధానంలో ఒక వస్తువు అమ్మకం అయ్యే చోట దానిపై ఎంత పన్ను విధించాలో నిర్ణయిస్తారు. ఇదివరకు వివిధ రాష్ట్రాలలో స్థానికపన్నులు వసూలు చేసేవారు. ఈ విధానంలో అవి ఉండవు.  కనుక వివిధ రకాల వస్తువులు, ఆహార ఉత్పత్తులని తయారుచేసి ఇతర రాష్ట్రాలకి పంపించే రాష్ట్రాలు ఈ నూతన పన్ను విధానంలో కొంత నష్టపోయే అవకాశం ఉంది. స్థానికపన్ను రద్దు వలన కూడా మరికొంత నష్టపోతాయి. ఐదేళ్ళ వరకు కేంద్రప్రభుత్వం ఆ నష్టాన్ని భరించడానికి సిద్దం అయినప్పటికీ నేటికీ కొన్ని రాష్ట్రాలు ఈ జి.ఎస్.టి.బిల్లుపై అభ్యంతరాలు చెపుతూనే ఉన్నాయి. ఈ జి.ఎస్.టి.పన్ను విధానం అమలు చేయడానికి సమయం దగ్గర పడుతున్నందున, ఈలోగానే ఈ పన్నురేటు, విధానంపై అన్ని రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం సాధించడం చాలా అవసరం. అందుకే ఈ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.