
ఓడిశా రాజధాని భువనేశ్వర్ లో గల ఎస్.యు.ఎం.ఆసుపత్రిలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 23 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మరో వందమందిని నగరంలోని అపోలో, క్యాపిటల్, ఎయిమ్స్ ఏ.ఎం.ఆర్.ఐ.ఆసుపత్రులకి తరలించారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం నిన్న రాత్రి సుమారు 7.30 గంటలకి జరిగింది. ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో మొదట ఈ మంటలు చెలరేగి క్షణాలలో ఆసుపత్రి అంతటా వ్యాపించడంతో తీవ్ర అనారోగ్యంతో కదలలేని పరిస్థితిలో ఉన్న రోగులు తమ మంచాల మీదే సజీవ దహనం అయ్యారు. రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకి పరుగులు తీసిన కారణంగా ఆసుపత్రిలో అగ్నిమాపక పరికరాలున్నప్పటికీ నిరుపయోగంగా మారాయి. సాధారణంగా ఇటువంటి ప్రమాదాలు పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ అగ్నిమాపక ఎలక్ట్రానిక్ వ్యవస్థ, దానితో తక్షణం నీళ్ళు వెదజల్లే స్ప్రింకిల్ వ్యవస్తలు ఇప్పుడు అన్ని ఆసుపత్రులలో ఏర్పాటు చేయబడుతున్నాయి. కనుక ఈ ఆసుపత్రిలో కూడా అది ఏర్పాటు చేయబడే ఉండాలి. అయినా ఇంత ఘోర ప్రమాదం జరిగిందంటే ఆ వ్యవస్థ పనిచేయలేదని భావించవలసి ఉంటుంది.
నగరంలో అత్యాధునిక ఆసుపత్రులలో ఒకటిగా పేరు మోసిన ఎస్.యు.ఎం.లోనే ఇంత ఘోర అగ్ని ప్రమాదం జరగడం, అందులో ఇంత ప్రాణ నష్టం జరగడం చాల దిగ్బ్రాంతి కలిగిస్తోంది. ఈ సంగతి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని, ఆసుపత్రిలో రోగులని, సిబ్బందిని కాపాడే ప్రయత్నాలు చేస్తూనే అతి కష్టం మీద మంటలని అదుపు చేశారు. ఈ ప్రమాద కారణాలు తెలుసుకొనేందుకు ఓడిశా ప్రభుత్వం కుర్దా జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమీషన్ ఏర్పాటు చేసింది. ప్రాధమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.