జర్నలిస్టులకి ఉగ్రవాదుల నుంచి ముప్పు?

ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్ ‘టైమ్స్ నౌ’ కి చెందినప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి గురించి కొత్తగా పరిచయం అవసరంలేదు. ఇంటర్వ్యూలలో ఎంతటివాడినైన నిలదీసి ప్రశ్నించగల ధైర్యం, ఏ అంశంపైనైనా మంచి అవగాహనతో మాట్లాడే నేర్పుగల వ్యక్తి అని ఆయనకి పేరుంది. అంతేకాదు తన ప్రశ్నలతో ఎదుటవాడిని ఉక్కిరిబిక్కిరి చేయడం మరో ప్రత్యేకత.  

ఇటీవల సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు అందరి కంటే ఎక్కువ రెచ్చిపోయిన వ్యక్తి కూడా ఆయనే. కనుక ఉగ్రవాదులు ఆయనపై కన్నేసినట్లు నిఘావర్గాలు పసిగట్టడంతో ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. తీవ్రవాదులకి వ్యతిరేకంగా ఆయన కంటే కూడా గట్టిగా మాట్లాడిన సమాచార్ ప్లస్ చానల్ కి చెందిన జర్నలిస్టులు అశ్విని కుమార్ కి జెడ్ ప్లస్, ఉమేష్ కుమార్ కి వైకాపా కేటగిరీ భద్రత, అర్నబ్ గోస్వామికి వై కేటగిరి భద్రత, జీ న్యూస్ కి చెందినా సుదీర్ చౌదరికి ఎక్స్ కేటగిరి భద్రత కల్పించింది. వై కేటగిరి భద్రత పొందిన వారిరువురుకి 24 గంటలు 20 మంది సెక్యూరిటీ సిబ్బంది రక్షణ కల్పిస్తుంటారు.

రాజకీయ నాయకులకి, ప్రజా ప్రతినిధులు, మంత్రులకి ఇటువంటి భద్రత కల్పించడం విన్నాము కానీ ఇప్పుడు జర్నలిస్టులకి కూడా ఆస్థాయిలో భద్రత కల్పించవలసి వస్తున్నందుకు సంతోషించాలో, బాధపడాలో తెలియడం లేదు. వారికి భద్రత కల్పించడం మంచి నిర్ణయమే కానీ ఆ ఆర్ధిక భారాన్ని కూడా దేశంలో ప్రజలే మోయాలసి ఉంటుంది.