పవన్ కళ్యాణ్ ఏమ్మన్నారంటే?

తెదేపా ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం సమీపంలో గల తుందుర్రు ప్రాంతంలో ఒక మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం జరుగుతోంది.  దానిని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఊరు మధ్యలో నిర్మిస్తున్న దాని వలన తమ ప్రాంతం అంతా కాలుష్యం వ్యాపిస్తుందని వారు అభ్యంతరం చెపుతున్నారు. కానీ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, ప్రజల అనుమతి లేకుండా అక్కడ ఫుడ్ పార్క్ నిర్మాణం చేస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. 

ఆ పరిశ్రమని వ్యతిరేకిస్తున్నవారందరిపై పోలీసులు భూటకపు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. వారిని విడిపించుకోవడానికి వెళ్ళిన వారి తమతో పోలీసులు అసభ్యంగా మాట్లాడుతూ రోజంతా స్టేషన్లలో కూర్చోబెడుతున్నారని, ఈరోజు హైదరాబాద్ వచ్చిన మహిళలు పవన్ కళ్యాణ్ కి మోరపెట్టుకొన్నారు. చేపల చెరువులు ఏర్పాటు చేస్తామని మభ్యపెట్టి బలవంతంగా తమ భూములని గుంజుకొని, మూడు పంటలు పండే ఆ భూములపై ఆక్వా పరిశ్రమ నిర్మాణం మొదలుపెట్టారని వారు పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేశారు.

తరువాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “పరిశ్రమల ఏర్పాటుని నేను వ్యతిరేకించను కానీ పచ్చటి పంటలు పండే భూములని కప్పెట్టి దానిపై పరిశ్రమల స్థాపనకి నేను వ్యతిరేకం. ఆ పరిశ్రమని అక్కడే స్థాపించినట్లయితే ఆ గ్రామం కూడా చివరికి నందిగ్రాంలాగ రణరంగంలాగ మారడం ఖాయం. సాగుకి అనుకూలంగా లేని భూముల్లోనే పరిశ్రమలు స్థాపించుకోవాలి తప్ప పచ్చటి పంటలు పండే పంట భూములపై కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం ఇంత చిన్న విషయం ఎందుకు అర్ధం చేసుకోవడం లేదో నాకు తెయడం లేదు. 

అయన కృష్ణా గోదావరి నదులు చాలా పవిత్రమైనవని చెపుతుంటారు. వాటికి ఘనంగా పుష్కరాలు కూడా నిర్వహించారు. మళ్ళీ ఆయనే ఆ నదులని కాలుష్యం చేసే పరిశ్రమల స్థాపనకి అనుమతించడాన్ని ఏమనుకోవాలి? అసలు అంత చిన్న గ్రామంలో నెలరోజులుగా కర్ఫ్యూ విదించబడిందంటే నమ్మశక్యంగా లేదు. అక్కడి ప్రజలు ఏమైనా కత్తులు, తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారా? లేదా ప్రభుత్వంపై తిరుగుబాటుకి కుట్రలు చేస్తున్నారా? ఆ పరిశ్రమని వ్యతిరేకిస్తున్న గ్రామ ప్రజలపై ఈ పోలీసులు అరాచకాలు ఏమిటి? ఎందుకు? వారి అభిప్రాయాలని గౌరవించి పరిశ్రమని వేరే ప్రాంతానికి తరలించవచ్చు కదా? పరిశ్రమ వద్దన్నందుకు ప్రజలపై కేసులు బనాయించడం, అరెస్ట్ చేయడం, భయపెట్టడం, మహిళలతో అసభ్యంగా మాట్లాడటం చాలా తప్పు. 

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలి తప్ప పోలీసులని అడ్డు పెట్టుకొని దౌర్జన్యంగా పరిపాలన చేయడం తగదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సంగతి బాగా గుర్తు పెట్టుకోవాలి. పశ్చిమ జిల్లా ప్రజలే రాష్ట్రంలో తెదేపాకి అత్యధిక శాతం ఓట్లు వేసి గెలిపించారని మరిచిపోకూడదు. ముఖ్యమంత్రి వారి రుణం తీర్చుకోకపోయినా పరువాలేదు కానీ వారిని ఈవిధంగా ఇబ్బంది పెట్టవద్దు. వారి ఉసురు పోసుకోవద్దు. స్వయంగా నేనే అక్కడికి వెళ్ళి పరిస్థితులని పరిశీలించాలని అనుకొన్నాను. కానీ నేను అక్కడికి వెళితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయనే ఆలోచనతో గ్రామస్తులనే ఇక్కడికి రప్పించుకొన్నాను.  

అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గంగానది ప్రక్షాళన కోసం కృషి చేస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో భాజపా నేతలు కృష్ణా, గోదావరి నదులు కలుషితం అవుతుంటే చూస్తూ ఊరుకొన్నారు. స్థానిక భాజపా ఎంపి గోకరాజు గంగరాజుగారు కూడా తమ విజ్ఞప్తులని అసలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెపుతున్నారు. కనీసం ఇకనైనా తనకి ఓటేసి గెలిపించిన ప్రజల విజ్ఞప్తులు పట్టించుకోవాలని ఆయనని కోరుతున్నాను. రాష్ట్రంలో భాజపా ఎమ్మెల్యేలు, ఎంపిలు, నేతలు ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. 

ప్రభుత్వం తక్షణమే ఆ పరిశ్రమ నిర్మాణం నిలిపివేసి అక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు స్పందించకుంటే నేను గ్రామస్తుల తరపున నిలబడి పోరాటం చేస్తాను. పరిస్థితి అంత వరకు వెళ్ళకుండా ఈ సమస్యని సామరస్యంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిష్కరించమని ముఖ్యమంత్రిని కోరుతున్నాను,” అని పవన్ కళ్యాణ్ సున్నితంగా హెచ్చరించారు. 

సున్నితంగానైనా పవన్ కళ్యాణ్ తను చెప్పదలచుకొన్నది కుండ బ్రద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగానే చెప్పారు. బంతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్టులో ఉంది కనుక ఆయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.