భారత్ విచ్చేసిన బ్రిక్స్ దేశాద్యక్షులు

బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాధ్యక్షులు గోవా చేరుకొన్నారు. వాతావరణం బాగోలేకపోవడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సుమారు 7గంటలు ఆలశ్యంగా గోవా చేరుకొన్నారు. ఈ సమావేశాలలో భారత్-రష్యా మధ్య రక్షణ, విద్యుత్, వాణిజ్య రంగంలో అనేక ఒప్పందాలు జరుగబోతున్నాయి. అదేవిధంగా చైనా, బ్రెజిల్ దేశాలతో కూడా కొన్ని వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

బ్రిక్స్ సమావేశం మొదలవక మునుపే రష్యా, చైనా అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోడీ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈరోజు సమావేశాలు ముగిసిన తరువాత తమిళనాడులో కోడంకుళంలో రష్యా సహకారంతో నిర్మించబోయే 3వ,4వ అణు విద్యుత్ కేంద్రాలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పుతిన్ పాల్గొంటారు.  

యూరి దాడులు, సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత ఈ సదస్సు జరుగుతున్న కారణంగా దీనిలో పాక్ ఉగ్రవాదం గురించి చర్చించే అవకాశం ఉంది. పాక్ లో జరుగవలసిన సార్క్ దేశాల సదస్సులో సభ్యదేశాలు పాల్గొనడానికి తిరస్కరించిన కారణంగా దానిని రద్దు చేసుకొనగా, భారత్ లో బ్రిక్స్ సదస్సుకి ఆయా దేశాద్యక్షులు తరలిరావడం, పాక్ ఉగ్రవాదం గురించి చర్చించడం రెండూ పాకిస్తాన్ జీర్ణించుకోవడం కష్టమే.