పాకిస్తాన్ కి భారత్ తాజా ఆఫర్!

భారత్ పై పాక్ ఉగ్రవాదులు వరుసగా దాడులకి పాల్పడుతున్నప్పటికీ భారత్ మళ్ళీ పాకిస్తాన్ స్నేహహస్తం అందించడానికి సిద్దపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న డిల్లీలో భాజపా సమావేశంలో మాట్లాడుతూ, “భారత్ ఎప్పుడూ ఇరుగు పొరుగు దేశాలతో శాంతి, స్నేహమే కోరుకొంటుంది. పాకిస్తాన్ తో కూడా మనం స్నేహమే కోరుకొంటున్నాము. అందుకే నరేంద్ర మోడీ తన ప్రమాణస్వీకారోత్సవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కూడా ఆహ్వానించారు. కానీ మన వైఖరిని పాక్ అలుసుగా భావించి మనపైకి ఉగ్రవాదులని దాడులకి ప్రోత్సాహిస్తోంది. ఇదివరకులాగ భారత్ ఇప్పుడు మెతక వైఖరి అవలంభించబోమని మనం పాకిస్తాన్ కి, ప్రపంచాదేశాలకి కూడా చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చాము. ఒకవేళ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులని నిర్మూలించడం పాక్ వలన కాకపోతే దానికి సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉంది. మనం పాక్ లోని ఉగ్రవాదులకి వ్యతిరేకిస్తున్నామే తప్ప పాక్ ప్రజలని కాదు. ఆ విషయం సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారానే నిరూపించి చూపాము. కనుక పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనుకొంటే దానికి భారత్ కూడా సహాయపడుతుంది,” అని అన్నారు.