
తమిళనాడు గవర్నర్ గా వ్యవహరించిన కె. రోశయ్య పదవీకాలం కేంద్రప్రభుత్వం పొడిగించకపోవడంతో ఆగస్ట్ నెలాఖరున ఆయన తన పదవిలో నుంచి తప్పుకొన్నారు. అప్పటి నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావుకి తమిళనాడు బాధ్యతలు కూడా అప్పగించడంతో ఆయన రెండు రాష్ట్రాలు చూసుకొంటున్నారు.
ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యం కారణంగా సుమారు మూడు వారాలుగా ఆసుపత్రిలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇంకా మరికొంత కాలం ఆసుపత్రిలోనే ఉండవలసి ఉన్నందున రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఓ.పన్నీర్ సెల్వంకి ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అప్పగించబడ్డాయి. కనుక ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఇన్-చార్జ్ గవర్నర్, ఇన్-చార్జ్ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోంది. దీని వలన మున్ముందు ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావిస్తున్న కేంద్రప్రభుత్వం త్వరలోనే రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్ ని నియమించాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం.
గవర్నర్ పదవి నియామకం ప్రస్తావన వచ్చినప్పుడల్లా తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు పేరు అందరికీ గుర్తు రాకుండా ఉండదు. ఎందుకంటే ఆయనకి గవర్నర్ పదవి ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. కేంద్రప్రభుత్వం మళ్ళీ గవర్నర్ నియామకం గురించి ఆలోచిస్తోంది కనుక ఈసారైనా మోత్కుపల్లికి అవకాశం దక్కుతుందా లేదో చూడాలి.