
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ తన అనుచితమైన మాటలు, చేతలు, అసభ్యకరమైన బాడీ లాంగ్వేజ్ తో అమెరికాతో సహా అన్ని దేశాలలో తన పట్ల ప్రజలలో వ్యతిరేక భావం కలిగేలా చేసుకొంటున్నారు. అటువంటి వారిలో అనేక తెలుగు, హిందీ సినిమాలలో నటించిన ఇలియానా కూడా ఒకరు.
రిపబ్లికన్ పార్టీ తరపున న్యూజెర్సీలోని పి.ఎన్.సి.ఆర్ట్ సెంటర్ లో శుక్రవారం జరుగబోయే ఒక కార్యక్రమానికి అనేకమంది హిందీ, తెలుగు సినీపరిశ్రమకి చెందిన నటీనటులతో బాటు ఇలియానాకి కూడా ఆహ్వానం అందింది. కానీ తాను ట్రంప్ ని వ్యతిరేకిస్తున్న కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాదలచుకోలేదని స్పష్టంగా చెప్పడం విశేషం.
ఉగ్రవాద భాధితుల సహాయార్ధం విరాళాల సేకరణ పేరిట మంచి పేరున్న భారతీయ నటీనటులని రప్పించడం ద్వారా అమెరికాలో స్థిరపడిన భారతీయులని డోనాల్డ్ ట్రంప్ కి అనుకూలంగా ప్రభావితం చేసేందుకే ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అర్ధమవుతూనే ఉంది. అందుకే తన వలన ఒక్క ఓటు కూడా ట్రంప్ కి పడకూడదనే ఉద్దేశ్యంతో ఇలియానా ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పవచ్చు.