
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న డిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జమ్మూలో ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐ.ఐ.ఎం.) ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేసింది. ఇది దేశంలో 20వ ఐ.ఐ.ఎం. అవుతుంది. కాశ్మీర్ లోగల ఓల్డ్ గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో దానికి తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ విద్య సంవత్సరం నుంచే దానిలో ఐ.ఐ.ఎం.శిక్షణా తరగతులు మొదలుపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. జమ్మూలో ఐ.ఐ.ఎం.కి శాశ్విత భవనాలు నిర్మాణం పూర్తయ్యేవరకు అక్కడే శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ భవనాన్ని ఆదునీకరించి, ఐ.ఐ.ఎం. తరగతులు నిర్వహించడానికి రూ.61.90 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మనవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
ఇదేగాక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మరికొన్ని వరాలు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీనగర్ లోగల ఎన్.ఐ.టి. భవన సముదాయాన్ని ఆధునీకరించడానికి మరో రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రూ.50 కోట్లు ఖర్చు చేసి ఎన్.ఐ.టి. విద్యార్ధినుల కోసం జమ్ము మరియు కాశ్మీర్ లో చెరో మూడు హాస్టల్స్, మరొకటి లెహ్ ప్రాంతంలో నిర్మించబోతున్నట్లు మంత్రి చెప్పారు. ఇవి కాకుండా జమ్ము మరియు కాశ్మీర్ లో చెరొక ఆల్ ఇండియా ఇన్సిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సాస్ (ఏ.ఐ.ఐ.ఎం.ఎస్.) క్యాంపస్ లని ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.