ఆ 10 వేల కోట్లు ఎవరివో?

ఒకటి రెండు కాదు ఏకంగా రూ.10, 000 కోట్లు. అవి మావి కావంటే మావి కావని...అవి మీవంటే మీవేనని వాదించుకొంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. 

దేశంలో నల్లదనం వెలికి తీసేందుకు కేంద్రప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని వినియోగించుకొంటూ దేశంలో చాలా మంది బడాబాబులు ఆదాయపన్ను శాఖకి జరిమానాలు, వడ్డీలు చెల్లించి తమ నల్లదనాన్ని తెల్లధనంగా మార్చుకొన్నారు. అది సుమారు 63,500 కోట్లు వరకు ఉందని దానిలో 13,000 కోట్లు హైదరాబాద్ కి చెందిన వ్యక్తులు జమ చేశారని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ నిబంధనల ప్రకారం ఆ వ్యక్తుల పేరు ప్రకటించకపోవడంతో, ఏపిలో దానిపై బురద జల్లుడు ఆట మొదలైపోయింది. 

మొదట అది జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అన్నట్లుగా మాట్లాడారు. 

వారి విమర్శలపై స్పందించిన జగన్ “నల్లధనం వివరాలు సమర్పించిన వారి వివరాలని సిడిబిటి చాల గోప్యంగా ఉంచింది. ఇంతవరకు ఎవరి పేర్లు బయటపెట్టలేదు. మరి చంద్రబాబు నాయుడుకి ఆ డబ్బు నేనే చెల్లించానని ఎలాగ తెలిసింది? అని ప్రశ్నించారు. బహుశః అది చంద్రబాబు నాయుడి బినామీ డబ్బే అయ్యుంటుంది. అందుకే ఆయన ఆ విషయం అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారేమో? అని ఎద్దేవా చేశారు. నల్లధనం సమర్పించినవారి పేర్లని బహిర్గతం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ ఒక లేఖ కూడా వ్రాశారు. ఆ వివరాలు బయటపెడితే రాష్ట్రంలో ఎవరు ఆ నల్లధనం చెల్లించారో, ఎవరి దగ్గర నల్లధనం ఉందో ప్రజలకి కూడా తెలుస్తుందని జగన్ అన్నారు.