
పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారయింది. ఈరోజు డిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినేట్ సంఘంలో నవంబర్ 16 నుంచి డిశంబర్ 16 వరకు నెల రోజులపాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలలో మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద బలమైన అంశాలు ఏవీ లేవనే చెప్పవచ్చు. గత సమావేశాలలో ప్రత్యేక హోదా అంశంతో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టగలిగింది. కానీ సమావేశాలు ముగిసే సమయానికి మోడీ ప్రభుత్వనిదే పైచెయ్యి అయ్యింది.
మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన జి.ఎస్.టి.బిల్లుకి అన్ని పార్టీలు సహకరించి పార్లమెంటు ఆమోదముద్ర వేసినందుకు ప్రభుత్వం చాలా సంతోషించింది. దేశంలో పన్ను విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే ఆ బిల్లుకి అనేక అవరోధాలు ఎదుర్కొన్న తరువాత పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకోవడం మోడీ ప్రభుత్వానికి ఘన విజయమేనని చెప్పవచ్చు. ఈసారి సమావేశాలు కూడా మోడీ ప్రభుత్వాన్ని పెద్దగ ఇబ్బందిపెట్టే అంశాలు ఏమీ కనబడటం లేదు. కనుక సజావుగానే సాగిపోయే అవకాశాలున్నాయి.