
దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కనుక శాసనసభ స్థానాలు కూడా చాల ఎక్కువే. మొత్తం 403 స్థానాలున్నాయి. వాటికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అధికార సమాజ్ వాదీ పార్టీ, ప్రతిపక్ష బి.ఎస్.పి, కాంగ్రెస్, భాజపాలు అన్నీ ఆ ఎన్నికలలో గెలిచేందుకు ఆర్నెల్లు క్రితమే సన్నాహాలు మొదలుపెట్టేశాయి. కనుక సర్వే సంస్థలు కూడా అప్పుడే సర్వేలు మొదలుపెట్టేశాయి. అందరికంటే ముందుగా ఇండియా టుడే-యాక్సిస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే ఫలితాలని వెల్లడించాయి.
రాష్ట్రంలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నప్పటికీ దానికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తి మెజారిటీ రాదని తేల్చి చెప్పింది. ఇండియా టుడే-యాక్సిస్ సర్వే ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి:
మొత్తం సీట్లు: 403.
ప్రభుత్వం ఏర్పాటుకి కావలసిన మ్యాజిక్ సంఖ్య: 202
భాజపా:170-183, సమాజ్ వాదీ: 94-103, బహుజన్ సమాజ్ వాదీ: 115-124, కాంగ్రెస్: 8-12, ఇతరులు 2-6 సీట్లు పొందే అవకాశం ఉంది.
ఓట్లు శాతం:
భాజపా-31%, బి.ఎస్.పి.-28%, ఎస్.పి.-25%; కాంగ్రెస్-6%, ఇతరులు-10%
ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది?
సర్వేలో 31శాతం మంది ప్రజలు మాయావతి ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా 27 శాతం మంది మళ్ళీ అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అవ్వాలని, 18 శాతం మంత్రి రాజ్ నాథ్ సింగ్, 14 శాతం మంది యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి షీలా దీక్షిత్, ములాయం సింగ్ యాదవ్ లకి చెరో 1 శాతం మాత్రమే మద్దతు లభించింది. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే స్వర్గీయ ఇందిరాగాంధీకి అసలైన వారసురాలని భావించే ప్రియాంకా వాద్రాకి కూడా ఈవిషయంలో యూపి ప్రజలు కేవలం రెండు శాతం మంది మాత్రమే ముఖ్యమంత్రి కావాలని కోరుకొన్నారు.
శాంతిభద్రతలు:
ఈ విషయంలో అందరికంటే చాలా ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి మాయావతికే ఎక్కువ మంది మొగ్గు చూపారు. మాయావతికి-64 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్-17, రాజ్ నాథ్ సింగ్-18 శాతం మంది మొగ్గు చూపారు.
కాంగ్రెస్ రహిత దేశం అవసరమేనా?
చాలా మంది రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఉద్దేశ్యం కనబరచనప్పటికీ, ‘కాంగ్రెస్ రహిత భారత్’ అనే భాజపా ఆలోచనని 54 శాతం మంది తిరస్కరించడం విశేషం. కేవలం 29 శాతం మంది మాత్రం భాజపా అభిప్రాయంతో ఏకీభవించారు. మరో 17శాతం మంది కాంగ్రెస్ దేశానికి అవసరమో కాదో చెప్పలేకపోయారు.
కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎవరు కాపాడగలరు?
రాహుల్ గాంధీ-38శాతం, ప్రియాంకా వాద్రా-19 శాతం, ముఖ్యమంత్రి అభ్యర్ధి షీలా దీక్షిత్-9 శాతం.