
రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రపంచ ప్రజలు తలో రకంగా అనుకొంటున్నారు. అది చాలా సహజమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అయన గురించి తన అభిప్రాయం చెప్పారు. ఈరోజు తాత్కాలిక సచివాలయంలో తన ఛాంబర్ లో ప్రవేశించిన సందర్భంగా ఆయన కుటుంబ విలువల గురించి మాట్లాడుతూ, “భారత్ లో బలమైన కుటుంబ వ్యవస్త, విలువలు ఉన్నాయి. అది భారత్ కే స్వంతం. అమెరికాలో ఒక్కొక్కరూ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొంటున్నారో చూస్తున్నాము. డబ్బుంటే ఎన్ని పెళ్ళిళ్ళయినా చేసుకోవచ్చన్నట్లుగా ఉంటుంది అక్కడి ధోరణి. ట్రంప్ నే చూడండి..అతనికి ఆమె నాలుగవ భార్య అనుకొంటాను. అది తాత్కాలిక మోజు మాత్రమే. అవి కుటుంబ విలువలు కావు. చివరికి చైనా వంటి దేశంలో కూడా కుటుంబాలు విడిపోతున్నాయి. కొడుకో, కూతురో వేరే కాపురం పెడితే ఏడాదికి ఓసారి పలకరించి రావడం అక్కడ సర్వసాధారణ విషయం అయిపోయింది. కేవలం మన భారతదేశంలోనే కుటుంబ విలువలు ఇంకా బలంగా స్థిరంగా ఉన్నాయి,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ట్రంప్ కి మహిళల పట్ల గౌరవం, మర్యాద లేవనే సంగతి ఇప్పటికే చాలాసార్లు ఆయనే నిరూపించి చూపుకొన్నారు. కనుక అటువంటి వ్యక్తికి కుటుంబ విలువలని గౌరవిస్తారని ఆశించడం కష్టం. మిగిలిన దేశాలతో పోలిస్తే నేటికీ భారత్ లోనే కుటుంబ వ్యవస్థ, దాని విలువలు స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ ట్రంప్ గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబు వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఆయనకి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కి చురుక్కుమనిపించవచ్చు. ఎందుకో అందరికీ తెలుసు.