కరుణానిధి సందేహాన్ని తీర్చేదెవరు?

తమిళనాడు రాష్ట్ర ఆర్ధికమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకి అధికారం కట్టబెడుతూ రాజ్ భవన్ నుంచి నిన్న ఒక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి జయలలిత సూచన మేరకే ఆ ఏర్పాటు చేసినట్లు అందులో పేర్కొన్నారు. 

దానిని డిఎంకె అధినేత కుమారుడు స్టాలిన్ స్వాగతించారు కానీ కరుణానిధి మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాలు తీసుకొని ఫైల్స్ పై సంతకాలు చేయగలిగేంత ఆరోగ్యంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఆమె అంత ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆమెని కలవడానికి ఎవరినీ ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. 

ఆయన తన మనసులో మాట నేరుగా బయటకి చెప్పలేదు కానీ ఆయన ఉద్దేశ్యం ఏమిటో అర్ధం అవుతూనే ఉంది. పన్నీర్ సెల్వంకి అధికారం కట్టబెట్టడం వెనుక ఏదో కుట్ర ఉంటుందని ఆయన అనుమానిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆయన అనుమానానికి బలమైన కారణమే ఉంది.

సరిగ్గా మూడు రోజుల క్రితమే అన్నాడిఎంకె బహిష్కృత ఎంపి శశికళ గవర్నర్ కి ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖలో జయలలితకి సన్నిహితంగా మెలుగుతున్నవారు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి, అధికారం కైవసం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కనుక జయలలిత సంతకంతో గవర్నర్ కి ఎటువంటి లేఖలు వచ్చినా ఆమె సంతకం నిజమా..కాదాని దృవీకరించుకోవలసిందిగా గవర్నర్ ని కోరారు. బహుశః అందుకే కరుణానిధి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారేమో?

జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు రోజూ చెప్పిందే  చెపుతున్నారు తప్ప కొత్తగా ఏమీ చెప్పడం లేదు. ఆమెని ఎవరూ చూడటానికి కూడా అనుమతించడం లేదు. కనీసం ఆమె తాజా ఫోటో కూడా మీడియాకి విడుదల చేయలేదు. కనుక సహజంగానే ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి ఇటువంటి అనుమానాలు, ఊహాగానాలు చెలరేగుతూనే ఉంటాయి.