
తమిళనాడులో నిన్న చాలా ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరిగాయి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సూచన మేరకు ఆ రాష్ట్ర రాజ్ భవన్ నుంచి నిన్న ఒక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కీలకమైన హోం, రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రజా సంబంధాల శాఖలని రాష్ట్ర ఆర్ధికమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకి అప్పగిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జయలలిత కోలుకొనే వరకు ఆయనే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తారని కూడా ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనబడింది. అంటే ఆయనకి రాష్ట్ర ప్రభుత్వంపై సర్వాధికారాలు కట్టబెట్టినట్లు చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జయలలిత సలహామేరకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆ ప్రకటనలో స్పష్టంగా తెలియజేయడం వలన ఆమె కోలుకొంటున్నారనే విషయం కూడా స్పష్టం అయ్యింది. కానీ ఆమెకి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన కారణంగా ఆమె తను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలని కూడా తన విధేయుడు పన్నీర్ సెల్వంకి అప్పగించినట్లు స్పష్టం అయ్యింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్:166 లోని సెక్షన్: సి ప్రకారం ఈ తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్ భవన్ నిన్న రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీనితో తమిళనాడులో రాజకీయ అనిశ్చిత స్థితి చాలా వరకు తొలగిపోయినట్లే భావించవచ్చు.