
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో ఆమెకి సన్నిహితులైన అన్నాడిఎంకె నేతలు కొందరు అధికారం చేజిక్కించుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె మంత్రివర్గ సహచరులు అపోలో ఆసుపత్రిలోనే అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఆమె కోలుకొనే వరకు పరిపాలనా వ్యవహారాలు చూసేందుకు ఉప ముఖ్యమంత్రి లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. వెంటనే సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి గవర్నర్ ని కలవడంతో మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయ్యుండవచ్చునని చాలా మంది భావించారు. కానీ గవర్నర్ కార్యాలయం నుంచి ఇంతవరకు జయలలిత వారసురాలిగా ఎవరినీ నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడలేదు. కానీ పార్టీలో తెర వెనుక కుట్రలు జోరుగా సాగుతున్నాయని, ఆ పార్టీ నుంచి బహిష్కరింపబడిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. కేవలం ఆరోపించడమే కాదు ఇన్-చార్జ్ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావుకి ఒక లేఖ కూడా వ్రాశారు.
జయలలితకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారు కొందరు ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అన్నాడిఎంకె పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రెటరీని నియమించాలని ప్రయత్నిస్తున్నారని, ఆవిధంగా పార్టీని, ప్రభుత్వాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆమె తన లేఖలో వ్రాశారు. కనుక ప్రభుత్వం వద్ద నుంచి జయలలిత పేరిట ఎటువంటి లేఖలు అందినా వాటిలో ఆమె సంతకాన్ని జాగ్రత్తగా పరిశీలించమని లేఖలో గవర్నర్ ని కోరారు.
జయలలితకి సన్నిహితంగా మెలిగే వ్యక్తి అంటే ఆమె స్నేహితురాలు శశికళేనని వేరే చెప్పనవసరం లేదు. ఆమెకి ఎటువంటి అధికారం లేకపోయినా ప్రభుత్వ నిర్వహణలో జోక్యం చేసుకొంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రోజుల క్రితం పార్టీ నుంచి శశికళ గవర్నర్ కి ఇటువంటి లేఖ వ్రాయడం సంచలనం సృష్టించింది. అయితే జయలలిత ప్రస్తుత పరిస్థితి గురించి గవర్నర్ తో సహా అందరికీ తెలుసు కనుక ఆమె పేరుతో ఇప్పుడు ఎవరూ లేఖలు పంపే సాహసం చేస్తారనుకోవడం అవివేకమే!
జయలలితకి భయపడి అన్నాడిఎంకె నేతలు మౌనంగా ఉండిపోయిన మాట వాస్తవం అలాగని వారికి అధికార దాహం లేదనుకోవడానికి లేదు. ఆ అధికారం కోసమే వారందరూ ఆమె కాళ్ళ మీద సాగిలపడి దండాలు పెడుతుంటారు. కనుక ఏ మాత్రం అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలో చాలా మంది తప్పకుండా ప్రయత్నించడం ఖాయం అని చెప్పవచ్చు.