.jpg)
తమిళ ప్రజలందరికీ, ముఖ్యంగా అన్నాడిఎంకె శ్రేణులకి ఒక శుభవార్త. ఇది రేపు జరుగబోయే దసరా పండుగకి సంబందించింది కాదు. వారి ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి! గత 18రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొందుతున్న జయలలిత ఆదివారం మధ్యాహ్నం కళ్ళు తెరిచారని ఆమెకి చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఆసుపత్రిలో చేరిన తరువాత ఆమె నిన్ననే మొట్టమొదటిసారిగా కళ్ళు తెరిచి చూశారు. తను ఆసుపత్రిలో ఉన్నాననే సంగతి ఆమె గ్రహించడమే కాకుండా తనకి ఏమైందని సైగల ద్వారా వైద్యులని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆమె బీపి, షుగర్ కూడా మళ్ళీ సాధారణ స్థాతికి వచ్చాయని తెలుస్తోంది. అంటే ఆమెకి అందిస్తున్న వైద్య చికిత్స ఫలిస్తోందని, దానితో ఆమె మెల్లగా కోలుకొంటున్నట్లు స్పష్టం అవుతోంది.
ఆమెని ఆసుపత్రిలో చేర్చిన రోజు నుంచి ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి మీడియాలో పుకార్లు, ఊహాగానాలు వినిపిస్తుండటంతో తీవ్ర కలత చెందిన అన్నాడిఎంకె పార్టీ శ్రేణులకి ఈ చిన్న వార్త కొత్త ఉత్సాహానిచ్చింది. ఈరోజు హెల్త్ బులెటిన్ లో ఆసుపత్రి వైద్యులు ఈవిషయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వారు అధికారికంగా ఈరోజు ప్రకటించినట్లయితే, రేపు జరుగబోయే దసరా పండుగ కంటే అన్నాడిఎంకె శ్రేణులకి ఇదే గొప్ప శుభవార్త అవుతుందని చెప్పవచ్చు.