అయ్యో ఆమె కూడా జంపా?

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కొన్ని రోజుల క్రితం భాజపాకి, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆవాజ్-ఏ-పంజాబ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. దానితో ఆయన పంజాబ్ రాజకీయాలలో పెద్ద సంచలనమే సృష్టించారు. కానీ ఆ తరువాత ఏమయిందో గానీ ఒకరోజు హటాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనది రాజకీయ పార్టీ కాదని, పంజాబ్ ఎన్నికలలో ఓట్లు చీల్చాలనే ఉద్దేశ్యం తనకి లేదని ప్రకటించేశారు. కానీ రాష్ట్రంలో 140 అసెంబ్లీ స్థానాలలో తమ ఫ్రంట్ పోటీ చేస్తుందని చెప్పారు.

ఆయన భార్య నవజ్యోత్ కౌర్ కూడా పంజాబ్ లోని అమృత్ సర్ భాజపా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త భాజపాకి రాజీనామా చేసి వెళ్ళిపోయినందున ఆమె కూడా వెళ్ళిపోతారని అందరూ ఊహించారు. కానీ దాదాపు నెల రోజుల తరువాత ఇవ్వాళ్ళ అంటే శనివారం ఆమె కూడా రాజీనామా చేశారు.

పంజాబ్ భాజపా అధ్యక్షుడు విజయ్ సాంప్లా ఆమె రాజీనామాని మారు మాట్లాడకుండా వెంటనే ఆమోదించారు. ఆమె కూడా తన భర్త ఏర్పాటు చేసిన ఆవాజ్-ఏ-పంజాబ్ లో చేరుతారని వేరే చెప్పనవసరం లేదు.