1.jpg)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మెల్లగా కోలుకొంటున్నట్లు వైద్యులు చెపుతున్నప్పటికీ ఆమె ఇంకా ఎప్పటికి పూర్తిగా కోలుకొంటారో, మళ్ళీ ఎప్పుడు తన బాధ్యతలు నిర్వర్తించగలరో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనుక ఆమే కోలుకొనే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించాలని భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కి లేఖ వ్రాశారు. అయితే రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగిలిన ప్రభుత్వం అంతా యధాప్రకారం పనిచేస్తున్నప్పుడు, ఇటువంటి ఆలోచనలు చేయడం రాజకీయ దుర్దేశ్యంతో కూడుకొన్నవిగానే భావించవలసి వస్తుంది.
తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఆ రాష్ట్ర ఇన్-చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుని కొద్ది సేపటి క్రితం కలిసి జయలలిత ఆరోగ్య పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ గురించి వివరించారు. తాజా సమాచారం ప్రకారం ఆమె కోలుకొనేవరకు తాత్కాలికంగా ఆమె స్థానంలో వేరొకరిని ఎవరినైనా ముఖ్యమంత్రిగా నియమించాలని అధికార అన్నాడిఎంకె పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ వాటిని ఇంకా దృవీకరించవలసి ఉంది. గతంలో అక్రమాస్తుల కేసులో జయలలిత కొన్ని రోజులు జైలుకి వెళ్ళినప్పుడు, ఆమెకి వీరవిదేయుడిగా పేరున్న పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిగా చేశారు. ఒకవేళ తాత్కాలికంగా ముఖ్యమంత్రిని నియమించవలసి వస్తే బహుశః మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకే అ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావించవచ్చు.