అప్పటి వరకు భారత్-పాక్ సరిహద్దులు క్లోజ్!

గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాలలో వరుసగా జరుగుతున్న పాక్ ఉగ్రవాదుల దాడులని దృష్టిలో ఉంచుకొని 2018 డిశంబర్ వరకు భారత్-పాకిస్తాన్ సరిహద్దులని పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకొన్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్ది సేపటి క్రితం రాజస్థాన్ లో జైసల్మేర్ లో ప్రకటించారు. సరిహద్దుల వద్ద భద్రతా వ్యవస్థని ఇంకా ఆధునీకరించేందుకు ప్రత్యేకంగా బోర్డర్ సెక్యూరిటీ గ్రిడ్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల గురించి సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎప్పటికప్పుడు ఈ గ్రిడ్ సమాచారం సేకరించి తదనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. 

భారత ప్రభుత్వం తీసుకొన్న ఈనిర్ణయం పాకిస్తాన్ కి చెంపదెబ్బ వంటిదేనని చెప్పవచ్చు. ముఖ్యంగా పాక్ నుంచి నిత్యం భారత్ లోకి జొరబడే ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదులకి ఇది పెద్ద అవరోధంగా మారనుంది. అధికారికంగా సరిహద్దులు మూసివేస్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది కనుక ఇకపై సరిహద్దు దాటి భారత్ లోకి ఎవరు ప్రవేశించాలని ప్రయత్నించినా వారిని శత్రువులుగానే భావించి వారిపై భారత్ సరిహద్దు భద్రతాదళాలు కాల్పులు జరుపుతాయి. కనుక ఇకపై ఉగ్రవాదులు సామాన్యపౌరుల ముసుగులో సరిహద్దు దాటలేరు.