అక్టోబర్ 8నుండి యుద్ధం మొదలవబోతోందా?

పాక్ తీసుకొంటున్న అనూహ్యమైన నిర్ణయాలు చూస్తుంటే అక్టోబర్ 8న లేదా అంతకంటే ముందుగా అది భారత్ పై దాడికి సిద్దం అవుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, ఆ రోజు నుంచి 13 రోజుల పాటు కరాచీ, లాహోర్ నగరాల గగనతలం మీదుగా పౌర విమానాలు ప్రయాణించడాన్ని నిషేధించింది. 

సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన తరువాత పాక్ ఉత్తర దిశలో భారత్ సరిహద్దుల వైపున్న గగనతలంలో పౌర విమానాలు ప్రయాణించడాన్ని నిషేదించింది. భారత్ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకపోయినప్పటికీ ఇప్పుడు కరాచీ లాహోర్ నగరాలపై నుండి విమానాల రాకపోకలు నిషేదించింది. ఈ నిషేధం కేవలం భారత్ విమానాలకి మాత్రమేనా లేక పాక్ తో సహా అన్ని దేశాల విమనాలకి కూడా వర్తిస్తుందా? అనేది ఇంకా తెలియవలసి ఉంది. 

ఈ నిషేధం కారణంగా పాక్ గగనతలంపై నుండి యూరోప్, అమెరికా, గల్ఫ్ దేశాలకి వెళ్ళవలసిన భారత్ విమానాలన్నీ గుజరాత్..అక్కడి నుంచి అరేబియా సముద్రం మీదుగా చుట్టుతిరిగి వెళ్ళవలసి వస్తుంది. దాని వలన విమానయాన సంస్థలపై అదనపు ఆర్దికభారం పడుతుంది. అది వేరే విషయం. 

కారణాలు ఏవైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని  భారత్ పై ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించి ఉండి ఉంటే అనుమానం కలిగి ఉండేది కాదు. కానీ “ఆర్మీ ఆపరేషన్స్ నిమిత్తం” నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడం గమనిస్తే అది భారత్ పై దాడులకి సిద్దం అవుతున్నట్లే అనుమానం కలుగుతోంది.

కరాచీ నగరం గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులకి చాలా దగ్గరలో ఉంది. అదేవిధంగా పాక్ అణ్వాయుధాలు ఉంచుకొన్న లాహోర్ నగరం డిల్లీ, పంజాబ్, జమ్మూ మరియు కాశ్మీర్ కి చాలా దగ్గరగా ఉంది. భారత్ లోని ఈ ప్రాంతాల నుండి భారత్ వాయుసేన ఆ రెండు నగరాలకి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. 

ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్ తో సహా అందరూ తమకి పాక్ పై దాడి, యుద్ధం చేయాలనే కోరిక ఏమాత్రం లేదని పదేపదే చెపుతున్నారు. పాక్ పాలకులు, సైన్యాధికారులు, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులే భారత్ పై దాడులు చేస్తామని, అణుబాంబులు కురిపించి ద్వంసం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. కనుక అయితే గియితే భారత్ ముందు జాగ్రత్త చర్యగా పాక్ విమానాలని తన గగనతలం మీదుగా ఎగురకుండా నిషేదించి ఉండాలి. కానీ యుద్దానికి కవ్విస్తున్న పాక్ నిషేదించింది. అంటే అర్ధం ఏమిటి? యుద్దానికి సిద్దం అవుతోందనేనా?అనే అనుమానించవలసి వస్తోంది.

సర్జికల్ స్ట్రయిక్స్ దాడులు జరిగినప్పటి నుంచి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న పాక్ గత వారం రోజులలో సరిహద్దులలో కాల్పులు తప్ప మరేమీ చేయలేదు. కనుక అంతకంటే ఇంకా ఏమీ చేయదని ఏమరపాటుగా ఉండటానికి వీల్లేదు. దాని హడావుడి, సన్నాహాలు చేస్తుంటే అది ఏదో చాలా పెద్ద దాడికే సిద్దం అవుతున్నట్లు అనుమానం కలుగుతోంది కనుక భారత్ పూర్తి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.