ఆ వీడియోని బహిర్గతం చేసే అవకాశం?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదులని మట్టుబెట్టడం కోసం వారం రోజుల క్రితం భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అటువంటిదేమీ జరుగలేదని, జరిగి ఉండి ఉంటే తమ సైన్యం వారిని ధీటుగా ఎదుర్కొని ఉండేదని పాక్ వాదిస్తోంది. 

పాక్ ఆ విధంగా వాదించడానికి బలమైన కారణాలున్నాయి. భారత్ ఆర్మీ జవాన్లు తమ అధీనంలో ఉన్న భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులని, వారి స్థావరాలని నాశనం చేసి వెళ్ళారని ఒప్పుకొన్నట్లయితే, దేశంలో ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా ముందు తలవంచుకోవలసి వస్తుంది. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదులని పెంచి పోషిస్తున్నట్లు ప్రపంచదేశాలకి చాటి చెప్పినట్లు అవుతుంది. అందుకే పాకిస్తాన్ పాలకులు, సైనికాధికారులు తేలు కుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఆ బాధని దిగమింగుకొని, సర్జికల్ స్ట్రయిక్స్ జరుగలేదని బుకాయించవలసి వస్తోంది.

అయితే వారు నోటితో ఖండిస్తున్నప్పటికీ మిగిలిన వారి చర్యలన్నీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లు దృవీకరిస్తూనే ఉన్నాయి లేకుంటే పాక్ మరీ ఇంతగా రెచ్చిపోయుండదు. పాక్ తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆ విధంగా తాపత్రయపడటం, అందుకు పాక్ మీడియా వత్తాసు పలకడం సహజమే. కానీ భారత్ లోని రాజకీయ నాయకులు, సినిమా నటులు కూడా పాకిస్తాన్ కి వంత్ పాడుతూ సర్జికల్ స్ట్రయిక్స్ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తుండటం చాలా దారుణం. వారికి దేశం, దేశభక్తి, భారత్ జవాన్ల త్యాగాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలు, మీడియా దృష్టిని ఆకర్షించడమే ప్రధానం అయిపోయాయి. 

పాక్ పాలకులకి, అక్కడి మీడియాకి వంత పాడుతున్న భారత్ లోని కొందరు నేతలకి, సినీ నటులకి బుద్ధి చెప్పేందుకు సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తున్నప్పుడు మన సైనికులు మరియు డ్రోన్స్ ద్వారా చిత్రీకరించిన వీడియోలని బహిర్గతం చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా సైనిక రహస్యాలని ఏ ప్రభుత్వం బహిర్గతం చేయదు. దాని వలన ఊహించని అనేక సమస్యలు ఎదురవవచ్చు. కానీ ఈ విమర్శలకి మాటలతో జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ వారు ఇంకా రెచ్చిపోతున్నారు.

పాక్ మీడియా కూడా ఈ అంశంపై భారత్ పై బురదజల్లుతోంది. భారత్ ఆర్మీకి అంత శక్తి సామర్ధ్యాలు లేవని వాదిస్తోంది. కనుక వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోని బహిర్గతం చేయడమే మంచిదని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. భారత ఆర్మీ కూడా అందుకు తమకేమీ అభ్యంతరం లేదని తెలిపినట్లు సమాచారం. కనుక ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని తాజా సమాచారం. 

భారత్ ఆర్మీ శక్తి సామర్ధ్యాలని అనుమానిస్తున్న వారి కోసం దానిని బహిర్గతం చేయడం అవసరమా? ఒకవేళ చేసినా అది కూడా మోడీ తన ఇమేజిని ఇంకా పెంచుకోవడానికే చేశారని వాదించకుండా ఉంటారా? కనుక దేశం పట్ల, భారత ఆర్మీ త్యాగాల పట్ల గౌరవం, నమ్మకం లేని వారికోసం దానిని బహిర్గతం చేయడం అనవసరమే.