సుప్రీం కోర్టు ఆదేశాలని పట్టించుకోరట!

దేశంలో సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యం. కొన్నిసార్లు చాలమంది దాని తీర్పుతో విభేదించినా, దానిని తిరస్కరించే సాహసం చేయరు. కానీ కర్నాటక ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పుని ఖాతరు చేయబోమని చెపుతోంది. నిన్నటి నుంచి రోజుకి 6,000 క్యూసెక్కులు చొప్పున ఈ నెల 30 వరకు తమిళనాడుకి కావేరీ జలాలని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని మొన్న గట్టిగా ఆదేశించింది. తన ఆదేశాలని ధిక్కరిస్తే సహించబోనని హెచ్చరించింది కూడా. 

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నిన్న సాయంత్రం అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భాజపా, జేడియు తప్ప మిగిలిన అన్ని పార్టీలు తమిళనాడుకి నీళ్ళు విడుదల చేయవద్దని ప్రభుత్వానికి గట్టిగా చెప్పాయి. అనంతరం ముఖ్యమంత్రి నిన్న రాత్రి తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం కనుగొన్నారు. వారు కూడా అదేవిధంగా చెప్పడంతో తమిళనాడుకి నీళ్ళు విడుదల చేయడం లేదని నిన్న రాత్రి బెంగళూరులో మీడియాకి తెలియజేశారు. ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన జరిగే అత్యున్నత సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొంటామని సిద్దరామయ్య చెప్పారు.

సుప్రీంకోర్టు తన ఆదేశాలని తప్పనిసరిగా పాటించాలని ఖరాఖండిగా చెప్పిన తరువాత కూడా కర్నాటక ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో, ఇంతవరకు కర్నాటక-తమిళనాడు రాష్ట్రాల మద్యన కావేరీ జలాల కోసం సాగుతున్న పోరాటాలు కొత్త మలుపు తిరిగి ఇప్పుడు కర్నాటక-సుప్రీంకోర్టుల మధ్య పోరాటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం జోక్యంతో కర్నాటక ప్రభుత్వం వెనక్కి తగ్గి తమిళనాడుకి నీళ్ళు విడుదల చేస్తే మంచిదే లేకుంటే ఈ సమస్య ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు.