
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిగా చేసి పదవీ విరమణ చేసిన జస్టిస్ మార్కండేయ కట్జూ నోటి దురద గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అంత అత్యున్నతమైన, కీలకమైన పదవిలో పని చేసిన ఆయన ట్వీట్టర్ లో తాజాగా పెట్టిన సందేశం చూస్తే ఎవరైనా షాక్ అవుతారు.
“పాకిస్తానీలు...మన మద్య ఇక గొడవలు వద్దు. వాటికి శాశ్వితంగా ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. కాశ్మీర్ ని మీకు ఇచ్చేయడానికి మేము రెడీ...కానీ ఒక షరతు! దానితో బాటు మీరు బిహార్ ని కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఒక ప్యాకేజి డీల్...దీనిలో మీకు ఒకటే ఆప్షన్ ఉంది. కావాలనుకొంటే రెండూ కలిపి తీసుకోవాలి. లేకుంటే కాశ్మీర్ ని అడగకూడదు. బిహార్, కాశ్మీర్ లని విడివిడిగా ఇవ్వబోము. బిహార్ తీసుకోకుంటే కాశ్మీర్ ఒక్క దానిని విడిగా ఇవ్వం. ఈ డీల్ మీకు ఓకేనా?” అని కట్జూ ట్వీట్ మెసేజ్ పోస్ట్ చేశారు.
సాధారణ న్యాయవాదులే చాలా హుందాగా వ్యవహరిస్తుంటారు. అటువంటిది దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సుదీర్గకాలం పనిచేసి, అనేక వేల కేసులపై తీర్పులు చెప్పిన జస్టిస్ కట్జూ ఇంత చవకబారుగా, దేశ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేవిధంగా, బీహార్ రాష్ట్రం పట్ల చాలా అవమానకరంగా, బీహారీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేవిధంగా ఇటువంటి చవకబారు కుళ్ళు జోకులు వేయడం ఎవరూ ఊహించలేరు. ఆగ్రహించకుండా ఉండలేరు.
ఆయన తనని తాను సమర్ధించుకొంటూ మరో మెసేజ్ కూడా పెట్టారు. “ఆనాడు ఆగ్రా సమావేశంలోనే అప్పటి ప్రధాని వాజపేయి పాకిస్తాన్ కి ఈ ఆఫర్ ఇచ్చారు. కానీ పాక్ అప్పుడు దానిని ఉపయోగించుకోలేదు. కనుక మళ్ళీ పాకిస్తాన్ కి నేను మరో అవకాశం ఇస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.
ఆయన చేసిన ఈ అవమానకరమైన వ్యాఖ్యలకి బీహార్ తో బాటు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కట్జూ పై తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ చాలా ఘాటుగా మెసేజులు పెడుతున్నారు. కానీ బిహార్ పట్ల ఆయన కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్ లో ఆటవిక పరిపాలన సాగుతోందని, బిహార్ లో ఆటవిక రాజ్యంగా మారిందని అన్నారు. అయితే అవి లాలూ, నితీష్ కుమార్ పాలనపై చేసిన వ్యాఖ్యలుగానే వారు భావించినప్పటికీ, బిహార్ ప్రజలు భాజపాని ఘోరంగా ఓడించారు. మళ్ళీ ఇప్పుడు కట్జూని కూడా భారతీయులు అందరూ కలిసి ఓడించవలసి ఉంది.