ఇంతకీ పాక్ ఎందుకు అంత హడావుడి చేస్తోంది?

యూరీలో ఉగ్రవాదుల దాడుల తరువాత భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయి. ఈ దాడి వలన దెబ్బ తిన్న భారత్ చాలా సంయమనంగా వ్యవహరిస్తుంటే, ఆ కుట్రని ప్రేరేపించిన పాకిస్తాన్ మాత్రం యుద్ధం..యుద్ధం..అణుబాంబులు..రక్తపాతం అంటూ అనవసరమైన మాటలు చాలా మాట్లాడుతూ భారత్ ని కవ్విస్తోంది. అంతే కాదు..పాక్ ఉత్తర సరిహద్దు రాష్ట్రాలలో యుద్ద విమానాలని గాలిలో చక్కర్లు కొట్టిస్తూ యుద్దవాతావరణం సృష్టించి చాలా హడావుడి చేస్తోంది. దాని వలన ఆ దేశమే చాలా నష్టపోతున్నప్పటికీ దాని మాటలు, హడావుడి ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. 

అయితే అదేదో ఆవేశంతో చేస్తున్నది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకు చాలా బలమైన కారణమే కనిపిస్తోంది. 

కాశ్మీర్ లో చాలా పకడ్బందీగా అల్లర్లు సృష్టించి, భారత్ చేత తప్పులు చేయించి కాశ్మీర్ సమస్యపై ప్రపంచ దేశాలు దృష్టి సారించేలాగ పాక్ చేయగలిగింది. కానీ కారణాలు ఏవైతేనేమి, ప్రపంచ దేశాలు కాశ్మీర్ వ్యవహరంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించాయి. అది పాకిస్తాన్ కి చాలా నిరాశే కలిగించి ఉండవచ్చు. కానీ కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లు, ఘర్షణలలో నానాటికీ మృతులు సంఖ్య పెరుగుతుండటం వంటి కారణాల చేత అంతర్జాతీయ వేదికలపై భారత్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. సరిగ్గా ఇటువంటి సమయంలో యూరీ ఘటన జరగడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ పరిస్థితి తారుమారైంది. 

ఈ విషయంలో భారత్ చాలా చురుకుగా, సంయమనంగా, ప్రపంచ దేశాలు ఆమోదించేవిధంగా వ్యవహరిస్తూ, ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తలదించుకోనేలాగ చేసింది. ఈ దుస్థితి నుంచి గౌరవంగా బయటపడాలంటే అందుకు బలమైన ఎత్తుగడ ఏదో వేయక తప్పదు. అందుకే యుద్ధం..యుద్ధం..అణుబాంబులు..రక్తపాతం అంటూ మాట్లాడుతోంది. 

అది చూసి సహజంగానే ప్రపంచదేశాలు కంగారుపడుతున్నాయి. నేటికీ భారత్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నా కూడా ఒకవేళ పాకిస్తాన్ ఏమాత్రం దుందుడుకుతనం ప్రదర్శించినా ఈసారి భారత్ చూస్తూ ఊరుకోదని తెలుసు. కనుక పాకిస్తాన్ తో బాటు భారత్ ని కూడా వెనక్కి తగ్గేలా అవి ఒత్తిడి చేయక మానవు. ఈ హడావుడిలో యూరీ ఘటన కూడా చరిత్రలో కలిసిపోతుంది. బహుశః ఇదే పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.