జగన్....అదేం పోలికరా బాయ్?

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి చర్చించేందుకు నిన్న ఎన్నారైలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ని చూసినవాళ్ళెవరైనా సరే తెలంగాణా ఉద్యమాలతో, ఆయన తన ప్రత్యేక హోదా పోరాటాలని పోల్చడం చూసి ఆశ్చర్యపోక మానరు.  

ఇంతకీ ఆయన ఏమ్మన్నారంటే “తెలంగాణా ప్రజలు కేంద్రప్రభుత్వంతో పోరాడి తెలంగాణా సాధించుకోగలిగినప్పుడు మనం కూడా పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా సాధించుకోగలము,” అని అన్నారు. 

అదే లక్ష్యంగా చిత్తశుద్ధితో పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా సాధించుకోవచ్చని మంత్రి కెటిఆర్ కూడా చెప్పారు. కానీ ఏపిలో రాజకీయ పార్టీలు ఆ అంశంపై రాజకీయాలు చేసుకొంటూ ఆధిపత్యపోరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తునందునే అది సాధించలేకపోతున్నారని కెటిఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయం అక్షరాల నిజమే. 

ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా జరుగుతున్న సమయంలో తెలంగాణా ఏర్పాటుకి వైకాపా మద్దతు ఇస్తుందని స్పష్టంగా చెప్పకుండా, కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు ‘తెలంగాణా సెంటిమెంటుని గౌరవిస్తాము’ అని జగన్మోహన్ రెడ్డి తప్పించుకొన్నారు. ఆ తరువాత రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయ్యి, తెలంగాణా ఏర్పాటు అనివార్యం అని పసిగట్టగానే, తననే నమ్ముకొన్న కొండా సురేఖ, మహేందర్ రెడ్డి వంటివారిని నడిరోడ్డున విడిచిపెట్టేసి, రాత్రికి రాత్రి మూటముల్లె సర్దుకొని తెలంగాణా విడిచిపెట్టేసి ఆంధ్రాలో వాలిపోయి, సమైక్యాంధ్ర ఉద్యమాలు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలుసు.

కనీసం ఆ ఉద్యమాలైన నిజాయితీగా నిర్వహించారా అంటే అదీ లేదు. ఒక పక్క  రాష్ట్రం విడిపోతున్న కారణంగానే ఆంద్రాలో వాలిపోయినప్పటికీ, తనకి ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం విడిపోకుండా చక్రం తిప్పుతానని ప్రజలని మభ్యపెట్టాలని చూశారు. ఒకసారి రాష్ట్రం విడిపోయిన తరువాత దానిని మళ్ళీ కలపడం అసాద్యం అని రాష్ట్ర ప్రజలకి కూడా తెలుసు. అందుకే తమని మభ్యపెట్టాలని ప్రయత్నించిన అయనని ఓడించి బుద్ధి చెప్పారు.  

ప్రత్యేక హోదా రాదని ఖచ్చితంగా తేలిపోయిన తరువాత కూడా మళ్ళీ ఇప్పుడూ ఆంధ్రా ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నిన్న ఎన్నారైలతో మాట్లాడినప్పుడు, “ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందో చెప్పలేను కానీ 2019ఎన్నికల వరకు ఈ వేడి చల్లారకుండా పోరాటాలు సాగిస్తాను. అప్పుడు ఎన్నికలలో మనమే అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు” అని చెప్పారు. 

ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక నెరవేర్చుకోవడానికే ఈ ఉద్యమాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొంటున్నట్లు ఆయన మాటలలోనే స్పష్టం అవుతోంది. జగన్ చేస్తున్న పోరాటం తన స్వార్ధం కోసం చేస్తున్నది. ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక నెరవేర్చుకోవడానికే చేస్తున్నది. తన కల సాకారం కానీయకుండా అడ్డు పడుతున్న చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీయడం కోసం చేస్తున్న పోరాటం అది. 

ప్రత్యేక హోదా అవసరమని ఏపిలో ప్రజలు నిజంగా భావించినట్లయితే వారే స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆయనకి మద్దతు పలికేవారు. కానీ ఆయన తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటాలతో రాష్ట్రానికి ఇంకా నష్టం కలిగిస్తున్నారని భావిస్తునందునే ఆయన ఆమరణ నిరాహార దీక్షలు చేసినా, బందులు, ధర్నాలు చేసినా వారు పట్టించుకోవడం లేదు. అందుకే ఆయన యువభేరిలు, ఇటువంటి వీడియో కాన్ఫరెన్సులు పెట్టుకొంటూ ప్రజల సహకారం అర్ధించవలసి వస్తోంది.

అధికారం కోసం చేస్తున్న తన రాజకీయ పోరాటాన్ని మహోన్నతమైన తెలంగాణా ఉద్యమాలతో పోల్చి చూపడం చాలా దారుణం. తెలంగాణా సాధన పోరాటాలకి అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. అనేకమంది బలిదానాలు చేసుకొన్నారు. తెలంగాణాలో పల్లె, పట్నం, నగరం, ఆడామగా, పిల్లాపాప, వృద్ధులు, ఉద్యోగులు అందరూ కలిసి పోరాడి సాధించుకొన్నారు. ఎందుకంటే అది వారి బ్రతుకు సమస్య..ఉనికి సమస్య..ఆత్మగౌరవానికి సవాలు. అందుకే దానికి ప్రజలు కూడా పోరాడారు. అటువంటి  మహోన్నతమైన తెలంగాణా ఉద్యమాలని చూపుతూ ఏపి ప్రజలని మళ్ళీ తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.