పాక్ పై ప్రధాని మోడీ స్పందన బాగానే ఉంది

యురీ ఉగ్రవాదుల దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ ఏవిధంగా స్పందిస్తారా అని భారత దేశ ప్రజలే కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారని చెప్పవచ్చు. ఈరోజు కేరళలోని కోజికోడ్ పట్టణంలో జరిగిన భాజపా జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని అందుకు వేదికగా ఎంచుకొని పాక్ ప్రభుత్వంపై ఆయన చాల తీవ్రమైన విమర్శలు చేసారు. 

తన ప్రసంగంలో భారత్-పాక్ రెండు దేశాల పాలకులు, విధానాలలో కనబడుతున్న స్పష్టమైన తేడాని పాక్ ప్రజలకి కళ్ళకి కట్టినట్లు చూపించారు. భారత్ విదేశాలకి ఇంజనీర్లని, సాంకేతిక నిపుణులని పంపిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదులని ఎగుమతి చేస్తోందని అన్నారు. గత నెల రోజులలోనే 110 మంది ఉగ్రవాదులు కాశ్మీర్ లో చొరబడేందుకు ప్రయత్నించి భద్రతాదళాల చేతిలో చనిపోయారు. వారందరూ మీ బిడ్డలు కారా? అని మోడీ పాక్ ప్రజలని సూటిగా ప్రశ్నించారు. 

పాక్ ఉగ్రవాదుల చేతిలో 18మంది భారతీయ సైనికులు చనిపోయినందుకు యావత్ భారత్ ప్రజలు చాలా బాధతో ఉన్నారని అందుకు వారు పాక్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న సంగతి పాక్ పాలకులు గ్రహించాలని మోడీ హెచ్చరించారు.   

భారత్-పాక్ దేశాలు రెంటికీ ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ ఏడు దశాబ్దాలలో భారత్ అన్ని రంగాలలో అభివృది సాధించింది కానీ తమ దేశం ఏమి సాధించిందో ఒకసారి ఆలోచించుకోవాలని పాక్ ప్రజలకి మోడీ విజ్ఞప్తి చేశారు. పాక్ పాలకుల అనుచిత వైఖరి వలననే పాకిస్తాన్ ఆసియా దేశాలలో బాగా వెనుకబడిపోయిందని మోడీ అన్నారు.

పాక్ ఉగ్రవాద వైఖరి వలన భారత్ మాత్రమే కాకుండా ఆసియా దేశాలన్నీ కూడా చాలా బాధలు పడుతున్నాయని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియా దేశాలన్నీ అభివృద్ధిలో పోటీ పడుతుంటే ఒక్క పాకిస్తాన్ మాత్రం గత ఏడు దశాబ్దాలుగా ఉగ్రవాదం గురించి మాత్రమే ఆలోచిస్తోందని మోడీ అన్నారు. కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడుతున్న పాక్ ప్రభుత్వం, దాని అధీనంలో ఉన్న కాశ్మీర్ లో ప్రజలనైనా సరిగ్గా చూసుకోలేకపోతోందని మోడీ ఎద్దేవా చేశారు. ఇకపై పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్, బలూచిస్తాన్ లో పాక్ అకృత్యాలకి పాల్పడితే చూస్తూ ఊరుకోమని మోడీ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

మోడీ తన ప్రసంగంలో ఎక్కడా పాక్ తో ప్రత్యక్ష లేదా పరిమిత స్థాయిలోనైనా యుద్ధం చేయాలనే కోరిక వెలిబుచ్చలేదు. కానీ పాక్ అధీనంలో ఉన్న ప్రాంతాలలో ఇకపై భారత్ జోక్యం చేసుకొంటుంది అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కానీ అది దౌత్యపరమైన యుద్ధంగానే భావించవచ్చు తప్ప ప్రత్యక్షంగా సైనిక జోక్యం చేసుకొంటుందని కాదు.బలూచిస్తాన్ లో మానవహక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించి అంతర్జాతీయంగా పాక్ పై ఒత్తిడి పెంచినట్లే, మిగిలిన ప్రాంతాల విషయంలో కూడా వ్యవహరించబోతున్నట్లు భావించవచ్చు.     

పాక్ పాలకులు భారత్ తో యుద్ధం చేయడం గురించి ఆలోచించడం మానుకొని, తమ దేశంలో ఆకలి, పేదరికంపై యుద్ధం చేయాలని, ఆ విషయంలో భారత్ పాక్ తో పోటీ పడేందుకు సిద్దంగా ఉందని అన్నారు. యుద్ధోన్మాదంతో విర్రవీగుతున్న పాక్ పాలకులకి మోడీ ఇచ్చిన ఈ సందేశం చెవికెక్కుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది.