
అమెరికాలో మళ్ళీ నిన్న రాత్రి (భారత కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం) ఒక షాపింగ్ మాల్లో కాల్పులు జరిగాయి. దానిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వాషింగ్ టన్ లోని బర్లింగ్ టన్ నగరంలో కాస్ కేడ్ షాపింగ్ మాల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ వార్త తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని షాపింగ్ మాల్ ని చుట్టుముట్టారు. కానీ పోలీసులు అక్కడికి చేరుకోక ముందే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతని కోసం నగరంలో గాలింపు చర్యలు చేపట్టారు.
కాస్ కేడ్ షాపింగ్ మాల్ పక్కనే ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్ లో కూడా ఆ సమయంలో చాలా రద్దీగా ఉంది. కాల్పుల శబ్దాలు వినబడగానే తమ రెస్టారెంట్ తలుపులు మూసేశామని దానిలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మీడియాకి తెలిపాడు. లేకుంటే కాల్పులు జరిపిన ఆ వ్యక్తి రెస్టారెంట్ లోకి ప్రవేశించి ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. పోలీసులు ఆ వ్యక్తిని సజీవంగా పట్టుకొంటేగానీ ఆ కాల్పులకి కారణం ఏమిటో తెలియదు. కానీ అమెరికాలో తరచూ జరుగుతున్న ఇటువంటి దురదృష్టకర ఘటనలకి ఆ దేశంలో వేళ్ళూనుకొన్న గన్ సంస్కృతే కారణమని అనేకసార్లు నిరూపితం అయ్యింది. బహుశః ఇప్పుడు అదే కారణం అయ్యుండవచ్చు.
చాలా విచిత్రమైన, విషాదకరమైన విషయం ఏమిటంటే ఆ విష సంస్కృతిని అమెరికాలో వ్యతిరేకించేవారు ఎందరున్నారో సమర్ధించేవారు అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్.ఆర్.ఏ.) అనే చాలా బలమైన సంస్థ దానిని సమర్ధిస్తోంది. అందుకోసం ఏటా అది $250 మిలియన్స్ ఖర్చు చేస్తోంది! ఆ మొత్తం అమెరికాలో గన్ సంస్కృతిని వ్యతిరేకిస్తున్న సంస్థలన్నీ చేస్తున్న ఖర్చు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఆ సంస్థ సామాన్య ప్రజలనే కాకుండా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులని కూడా ప్రభావితం చేయగల స్థాయికి ఎదిగిపోయింది. ఆ విషసంస్కృతి దేశానికి మంచిది కాదని, దానిపై పూర్తిగా నిషేధం విదించలేకపోయినా కనీసం దానికి అడ్డుకట్టవేసేందుకు కటినమైన ఆంక్షలైన అమలుచేద్దామని సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికన్ కాంగ్రెస్ లో ప్రతిపాదిస్తే, ఎన్.ఆర్.ఏ. ప్రభావం, ఒత్తిడికి లొంగిన సెనేటర్లు ఆ బిల్లుకి వ్యతిరేకించారు.
అలాగని ఎన్.ఆర్.ఏ. ఏదో ఉగ్రవాద సంస్థ కాదు. అటువంటి వాటికి అది మద్దతు ఈయడం లేదు కూడా. పైగా ఏటా అనేక ప్రజాహిత కార్యక్రమాలకి బారీగా విరాళాలు కూడా ఇస్తుంటుంది. కానీ దాని వెనుక ఉన్న ఆయుధాలు తయారుచేసే బడాసంస్థలు తమ ఆయుధాల వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్న లాభాలకి గండి పడుతుందనే భయంతోనే ఎన్.ఆర్.ఏ.ని తమ ముసుగుగా వాడుకొంటూ గన్ సంస్కృతికి ఎన్నడూ ఎవరి వలన భంగం కలగకుండా కాపాడుకొస్తున్నట్లు చెప్పక తప్పదు. అందుకే దానికి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు, చర్చలు జరుగుతున్నా నేటికీ అమెరికాలో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చేతిలో తుపాకులు కనబడుతుంటాయి.
ఈ విష సంస్కృతికి అమెరికాలో ఏటా వందలాది మంది అమాయకులైన ప్రజలు బలైపోతూనే ఉన్నారు. షాపింగ్ మాల్స్, చర్చిలు, పార్కులు, స్కూళ్ళు, ఆసుపత్రులు అనే తేడా లేదు. అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా అంతకంటే లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి చేతికి దురద పుడుతుందో తెలియదు. అప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. అయినా మాదక ద్రవ్యాలకి అలవాటుపడినట్లు ఆ గన్ సంస్కృతిని చాలా మంది వదిలించుకోలేకపోతున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని తిరుగుతుంటే అది చూసి భయంతో ఆత్మరక్షణ కోసం అయిన మరొకరు తుపాకి పట్టుకోక తప్పనిసరవడంతో దానిని వ్యతిరేకిస్తున్న వారు సైతం తుపాకులు పట్టుకోక తప్పడం లేదు. నిజంగా ఇది ఎంత విచారకరమైన విషయం!
ఇరాక్, సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఉగ్రవాద పీడిత దేశాలలో ఇటువంటి ఘటనలు జరిగితే అది సహజమేనని సరిపెట్టుకోవచ్చు కానీ అగ్రరాజ్యంగా పేరుపొంది ప్రపంచ దేశాలనన్నిటినీ శాశిస్తున్న అమెరికాలో ఈ విష సంస్కృతి వలన సామాన్య ప్రజలు ప్రాణాలకి రక్షణ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది స్వీయవినాశనం (సెల్ఫ్ డిస్ట్రక్షన్) చేసుకోవడం కాకపోతే ఏమిటి?