
వైకాపా కేసుల గురించి మాట్లాడితే అందరికీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు, సిబిఐ ఛార్జ్-షీట్లు, ఈడి జప్తులే గుర్తుకువస్తాయి. వాటికీ వైకాపాకి అంతగా విడదీయలేని అనుబందం ఏర్పడిపోయింది. కనుక జగన్ వాటి గురించే ఆలోచిస్తున్నారనుకొంటే పొరపాటే. ఆయన తనపై ఉన్న ఆ కేసుల గురించి ఆలోచించకుండా తనకి ఏమాత్రం సంబంధంలేని ఓటుకి నోటు కేసు గురించి ఆలోచిస్తూ పావులు కదుపుతున్నారు.
ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేయడంతో తెలంగాణా ఎసిబి కోర్టు ఆ కేసుని పునర్విచారణకి ఆదేశించడం, దానిపై చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం, అప్పుడు ఏసిబి విచారణపై హైకోర్టు 8 వారాలు స్టే విధించడం మొదలైన పరిణామాల గురించి అందరికీ తెలుసు. ఆ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్ రాజకీయ దురుదేశ్యంతో వేసినదేనని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఈ సమయంలో ఆ కేసులో తాము కలుగజేసుకోలేమని, కానీ చంద్రబాబు పిటిషన్ పై 8 వారాలకి బదులు 4 వారాలలో నిర్ణయం తీసుకోమని హైకోర్టుకి సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుని తెదేపా, వైకాపాలు తమకి అనుకూలంగా అన్వయించుకొని అది ఎదుట పార్టీకి చెంపదెబ్బ అని చెప్పుకొని సంబరపడ్డాయి.
అదే కేసులో నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం నిన్న నిలిపివేసింది.
ఈ ఓటుకి నోటు కేసు గురించి మీడియాలో వార్తలు వచ్చేలా చేసి, దానిని ప్రజలందరికీ మళ్ళీ మరోసారి గుర్తు చేయడం ద్వారా చంద్రబాబుకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం, ఆయనని మరింత అప్రదిష్టపాలు చేయడమే వైకాపా ఉద్దేశ్యం కనుక ఈ వార్తలన్నిటినీ తన సాక్షి మీడియాలో ప్రధానంగా ప్రచురించుకొని సంతృప్తిపడింది. మిగిలిన మీడియాలో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడా ఈ తాజా పరిణామాల గురించి వార్తలు ప్రచురించబడ్డాయి కనుక వైకాపా ఆశించిన ప్రయోజనం నెరవేరినట్లే చెప్పవచ్చు.