
యూరీ దాడుల కారణంగా ప్రస్తుతం భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూరీ దాడులని ప్రపంచదేశాలన్నీ గట్టిగా ఖండించాయి. వాటిలో రష్యా కూడా ఉంది. పైగా అది భారత్ ని మంచి నమ్మకమైన మిత్ర దేశంగా భావిస్తుంటుంది కూడా. యూరీ దాడులని అది కూడా తీవ్రంగా ఖండించింది కనుక పాకిస్తాన్ కి అది దూరంగా ఉంటుందని భావించడం సహజమే. కానీ రష్యాకి చెందిన 200 మంది సైనికులు రష్యా-పాక్ సంయుక్త సైనిక విన్యాసం చేసేందుకు శుక్రవారం ఇస్లామాబాద్ చేరుకొన్నారు. రేపటి నుంచి రెండు వారాలు రష్యా-పాక్ సైనిక దళాలు కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయని పాక్ సైనికాధికారి ఒకరు చెప్పారు. ‘ఫ్రెండ్ షిప్-2016 పేరిట జరుగబోయే పాక్-రష్యా సంయుక్త సైనికవిన్యాసాలు చాలా కాలం క్రితం నిర్ణయించుకొన్నవే.
సాధారణ పరిస్థితులలో అయితే వీటి గురించి ఎవరూ అసలు పట్టించుకొనేవారే కారు. కానీ యూరి దాడులకి నిరసనగా రష్యా ఈ విన్యాసాలలో పాల్గొనదని భారత్ భావించింది. కానీ ముందు నిర్ణయించుకొన్న ప్రకారమే రష్యా తన సైనిక బృందాన్ని పాకిస్తాన్పం కి పంపించడంతో యూరీ ఘటనకి అది అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని సూచిస్తునట్లుంది. దీనిపై భారత్ స్పందించలేదు.
యూరి దాడుల ప్రభావంతో భారత్ లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని జరిగాయి. పాకిస్తాన్ కి చెందిన ఏడుగురు నటీనటులు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు. ఇంకా అద్నాన్ సామి వంటి సుప్రసిద్ధ పాక్ గాయకులూ కూడా భారత్ లోనే స్థిరపడ్డారు. వారినందరినీ 48 గంటలలో దేశం విడిచివెళ్ళిపోవాలని మహరాష్ట్రాలోని నవనిర్మాణ సేన పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న చిత్రపట్ కర్మచారి సేన హెచ్చరించింది. లేకుంటే తీవ్ర పర్యవ్యవసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. వారిలో రాహత్ ఫతెహ్ అలీ ఖాన్, మావ్రా హోకేన్ , అలీ జఫార్, మహిర ఖాన్,ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ తదితర పాకిస్తానీ నటీనటులున్నారు.
పాకిస్తాన్ తో జరుగవలసిన ద్వైపాక్షిక సిరీస్ ఆలోచనని విరమించుకొంటున్నట్లు బి.సి.సి.ఐ. చైర్మన్ అనురాగ్ ఠాకూర్ స్వయంగా ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో తాము క్రికెట్ ఆడాలనుకోవడం లేదని అన్నారు.