
చైనాకి రాజ్యవిస్తరణ కాంక్ష..పాకిస్తాన్ యుద్ధోన్మాదం గురించి అందరికీ తెలిసిందే. అన్నివిధాల అభివృద్ధి సాధించి, అగ్ర రాజ్యాలతో పోటీ పడుతున్న చైనా తిన్నది అరగక తన సత్తాని లోకానికి చాటి చూపుకోవడానికి ఇరుగుపొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వితే ఆశ్చర్యం లేదు కానీ ప్రపంచ దేశాల ఆర్ధిక సహాయంపై ఆధారపడున్న పాకిస్తాన్ యుద్ధోన్మాదం ప్రదర్శిస్తుంటే చాలా విస్మయం కలిగిస్తుంది.
కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై భారత్ కంటే అది చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యుద్ద సన్నాహాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని తీరు చూస్తుంటే అదే ముందు భారత్ పై యుద్ధం ప్రకటిస్తుందేమో అన్నట్లుగా ఉంది.
భారత్ వైపున్న పాక్ ఉత్తర గగనతలంలో గత మూడు రోజులుగా సాధారణ విమానాలని అనుమతించకపోవడంతో కనీసం రోజుకి అరడజను విమానాలు రద్దు అవుతున్నాయి. పాక్ సరిహద్దు ప్రాంతాలలో పాక్ వైమానిక దళానికి చెందిన యుద్ద విమానాలు రివ్వురువ్వున దూసుకుపోతున్నాయి. ఆ ప్రాంతాలలో ఎం-1, ఎం-2గా పిలువబడే రోడ్ల మీదే పాక్ యుద్ద విమానాలు దిగుతుండటం చూసి పాక్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చాలా ఆందోళన చెందుతున్నారు.
పాక్ వాయుసేన చేస్తున్న ఈ హడావుడిని చూసి పాక్ మీడియా కూడా ఇక నేడోరేపో పాకిస్తాన్ పై భారత్ యుద్దానికి రాబోతోందని, అందుకే పాక్ వాయుసేన సన్నాహాలు మొదలుపెట్టిందని, భారత్ భద్రతాదళాలు పాక్ సరిహద్దుల వైపు కదులుతున్నాయంటూ కధలు కధలుగా వర్ణించి చెపుతుండటంతో పాక్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మీడియాలో వస్తున్న ఈ యుద్ద వార్తల కారణంగా పాకిస్తాన్ షేర్ మార్కెట్ కుప్పకూలింది. నిన్న 569 పాయింట్లు కోల్పోయే 39,771 వద్ద ముగిసింది. దానితో చిన్న మదుపరుదారులు చాలా తీవ్రంగా నష్టపోయారు.
పాక్ ప్రభుత్వం సృష్టించుకొన్న ఈ యుద్దవాతావరణం వలన తీవ్రంగా నష్టపోతున్న విమానయాన సంస్థలు, వ్యాపార సంస్థలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. పాక్ మీడియా సృష్టిస్తున్న ఈ భారత్-పాక్ యుద్ధవాతావరణం వలననే స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయని ఇది పాకిస్తాన్ కి ఏమాత్రం మంచిది కాదని కరాచీ స్టాక్ ఎక్స్ చేంజ్ మాజీ చైర్మన్ ఆరిఫ్ హబీద్ హెచ్చరించారు.
భారత్ నుంచి ఎటువంటి యుద్ద సంకేతాలు లేకపోయినా పాక్ యుద్ధోన్మాదంతో చేస్తున్న ఈ హడావుడి వలన ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ నష్టపోతుండటం చాలా విచిత్రంగానే ఉంది కదా?