ఓరి దేవుడా! వాళ్ళు ముంబైలోకి ప్రవేశించారా?

ముంబైలోని నలుగురు స్కూలు పిల్లలు ఈరోజు తమ ప్రిన్సిపాల్ కి ఇచ్చిన ఒక చిన్న సమాచారంతో ముంబై నగరం ఉలిక్కి పడింది. ముంబై పోలీసులని, వెస్ట్రన్ నేవీ కమాండ్ అధికారులని పరుగులు పెట్టిస్తోంది. మిలటరీ యూనిఫారం ధరించిన నలుగురు వ్యక్తులు చేతిలో తుపాకులు పట్టుకొని ఏదో మాట్లాడుకొంటూ వెళ్ళడం తాము గమనించామని, వారు తమకి తెలియని వేరే ఏదో బాషలో మాట్లాడుకొంటున్నారని ఆ పిల్లలు తమ ప్రిన్సిపాల్ కి చెప్పగానే ఆయన వెంటనే పోలీసులకి ఆ విషయం తెలియజేశారు. వారు వెస్ట్రన్ నేవీ కమాండ్ అధికారులని అప్రమత్తం చేశారు. వెంటనే ముంబై, నవీ ముంబై, థానే, రాయ్ ఘడ్ ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించి ఆ నలుగురు కోసం ముంబై పోలీసులు అన్ని ప్రాంతాలని జల్లెడ పడుతున్నారు.

గేట్ వే ఆఫ్ ఇండియా, రాజ్ భవన్, బోంబే హై (ఆఫ్ షోర్ ఆయిల్ ప్లాట్ ఫారం), బాబా ఆటామిక్ రీసర్చ్, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తదితర కీలక ప్రాంతాలలో పోలీసులని మొహరించి ఆణువణువూ గాలిస్తున్నారు. ఆ అనుమానితులు నలుగురు ముంబైకి 47కిమీ దూరంలో ఉరాన్ నావల్ కమాండ్ పరిసర ప్రాంతాలలో కనిపించినట్లు ఆ పిల్లలు చెప్పడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో పోలీసులు, నేవీ సిబ్బంది కూడా గాలింపు మొదలుపెట్టారు. వారు ఉగ్రవాదులా లేక నేవీ లేదా ఆర్మీకి చెందిన వ్యక్తులా అనే కోణం నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అనేక దేశాల, రాష్ట్రాల ప్రజలు సంచరించే ముంబై వంటి మహానగరంలో నలుగురు ఉగ్రవాదులు చొరబడితే వారిని కనిపెట్టడం చాలా కష్టమే. వారు భారత్ కి చెందిన ఆర్మీ లేదా నేవీ సిబ్బంది అయితే ఏ సమస్యా లేదు కాకపోతే ఇక ముంబై నగరం ల్యాండ్ మైన్ మీద కూర్చోన్నట్లు భావించవచ్చు.