మోడీ ప్రభుత్వం మరో సంచల నిర్ణయం

మోడీ ప్రభుత్వం నేడు మరో సంచలన నిర్ణయం తీసుకొంది. స్వాతంత్ర్యం రాక ముందు నుంచి నేటి వరకు కూడా వేరుగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ ని వచ్చే ఆర్ధిక సంవత్సరం సాధారణ బడ్జెట్ లో కలిపి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు డిల్లీలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకి ఆమోదముద్ర వేసింది. అదేవిధంగా ఇంతవరకు సాధారణ బడ్జెట్ లో వేర్వేరుగా చూపిస్తున్న ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయాలని కూడా వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి బడ్జెట్ లో ఒకే పద్దు క్రింద చూపాలనే ప్రతిపాదనకి కూడా ఆమోద ముద్రవేసింది. 

సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు రైల్వే బడ్జెట్ ని పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. కానీ దాని వలన ఆశించిన ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని భావించిన మోడీ ప్రభుత్వం దానిని ఆర్ధిక బడ్జెట్ లో కలిపివేయాలని నిర్ణయించింది. రైల్వే బడ్జెట్ అంటే రాష్ట్రాలకి కొత్త రైళ్ళు, రైల్వే లైన్లు, ప్రాజెక్టులు ప్రకటించాలనే ఒక నిశ్చిత,దురాభిప్రాయం, అపోహ ప్రజలలో ఏర్పడిపోయింది. అందుకు దేశాన్ని ఏలుతున్న రాజకీయ పార్టీలే కారణం అని చెప్పక తప్పదు.

ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అమలు చేసే ఉద్దేశ్యం లేని వాటిని కూడా రైల్వే బడ్జెట్ లో జోడించి ప్రజలని మభ్యపెట్టడం పరిపాటి అయిపోయింది. ఇక మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా అదే కారణం చేత రైల్వే బడ్జెట్లో తమ తమ ప్రాంతాలకి కేటాయింపుల కోసం పైరవీలు చేయడం అలవాటుగా మారిపోయింది. చివరికి సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నా ప్రజలని మభ్య పెట్టేందుకు ఎప్పటికప్పుడు రైల్వే బడ్జెట్ లో కొత్త కొత్త ప్రతిపాదనలు చేయడమే తప్ప పాతవాటిని అమలయ్యేవే కావు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా రైల్వే బడ్జెట్ ని ఆర్ధిక బడ్జెట్ లో కలిపివేశారు. కనుక ఇకపై దేశ వార్షిక బడ్జెట్ లోనే రైల్వేలకి అవసరమైన కేటాయింపులు కూడా జరుగుతాయి.