అదే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనా...

ఒక్కోసారి రాజకీయాలలో కూడా హాయిగా నవ్వుకోగల జోకులు వినిపిస్తుంటాయి. అటువంటిదే ఒక మంచి జోక్ ఈరోజు వినిపించింది. అదేమిటంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఉంటే నేడు కాశ్మీర్ లో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండేవే కావని గుజరాత్ పిసిసి అధ్యక్షుడు భరత్ సోలంకి అన్నారు.

“మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనేవారు కానీ ప్రధాని నరేంద్ర మోడీకి అంత ధైర్యం చూపలేకపోతున్నారు. ఇప్పుడు దేశానికి అటువంటి గొప్ప ప్రధానమంత్రి కావాలి. భారత్ సైనికులపై పాక్ తీవ్రవాదులు తెగబడి దాడులు చేసి ప్రాణాలు తీస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు. ఏమి చేయాలనుకొంటున్నారో చెప్పరు. అందుకే దేశ ప్రజలు, ముఖ్యంగా యువత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు,” అని సోలంకి అన్నారు.

యూపియే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి చేపడదామనుకొన్నారు. కానీ అందుకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఆ కుర్చీలో తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని కూర్చోబెడదామనుకొన్నారు. కానీ అంత బరువైన బాధ్యతలు మోయడం తనవల్ల కాదని రాహుల్ గాంధీ భయపడటంతో, ఆ కుర్చీలో తన వీరవిధేయుడు డా.మన్మోహన్ సింగ్ ని కూర్చోబెట్టి ఆమె రిమోట్ పద్దతిలో దేశాన్ని పాలించారు.

పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ ఆ కుర్చీలో కూర్చోవడానికి చాలా భయపడ్డారు. 2014 ఎన్నికల ముందు కాస్త ధైర్యం చేసి అందులో కూర్చోవడానికి సిద్దపడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయనకి ఆ అవకాశం దక్కలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవినైనా చేపడదామనుకొంటే, ‘మీకు నాయకత్వ లక్షణాలు లేవు.. ఆ పదవి చేప్పట్టడానికి మీరు అర్హులు కారు’ అని స్వంత పార్టీలో నేతలే కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ కారణంగానే లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉండేందుకు కూడా ఆయన వెనుకంజ వేయడంతో ఆ పదవిని మల్లిఖార్జున ఖర్గేకి కట్టబెట్టారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీకి లోక్ సభ వెనుక బెంచీలలో కునుకు తీయడం అలవాటయిపోయింది.

ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కూడా రాహుల్ గాంధీ శక్తి సామర్ధ్యాలు ఏపాటివో కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. యూపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అయన బదులు ప్రియంకా గాంధీకి బాధ్యతలు అప్పజెప్పాలని చెప్పారు.   

అటువంటి వ్యక్తి ఇక దేశాన్ని ఏమి నడిపించగలరు? ఇటువంటి క్లిష్టమైన సమస్యలు ఎదురైతే ఏవిధంగా పరిష్కరించగలరు?ఆయనే ప్రధానిగా ఉంటే దేశం ఏమైపోయుండేదో..తలుచుకొంటేనే భయం వేస్తోంది.