
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం సుదీర్గకాలం పాటు సాగిన ఉద్యమాల కారణంగా చివరికి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. దేశంలో గూర్ఖాల్యాండ్, విదర్భ తదితర రాష్ట్రాల ఏర్పాటు కోసం చాలా కాలంగానే ఉద్యమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రమైన యూపిలో, బీహార్ లో కూడా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు వినపడుతూనే ఉన్నాయి. వీటిలో మహారాష్ట్రాలోని విదర్భ ప్రాంతంలో ప్రజలు చిరకాలంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా తేనెతుట్టె వంటి ఈ అంశాన్ని కదపడానికి వెనుకంజ వేస్తుంటాయి. యూపియే ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో ధైర్యం చేసి తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లని అందుకే పట్టించుకోలేదు.
కానీ మహారాష్ట్రాలో విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం ఆ ప్రాంతంలో ప్రజలు నిరంతరంగా ఏదో ఒక స్థాయిలో ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేవరకు తమ పోరాటాలు కొనసాగుతాయని చెపుతున్నారు.
విదర్భ కోసం జరుగుతున్న ఉద్యమాలపై తెరాస నిజామాబాద్ ఎంపి కవిత స్పందిస్తూ, “తెలంగాణా కోసం పోరాడిన మాపార్టీ విదర్భవాసుల ఆవేదనని అర్ధం చేసుకొగలదు. ఆ ప్రాంతంలో ప్రజలు మాట్లాడే బాష, సంస్కృతి సంప్రదాయాలు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చాలా తేడా ఉంది. అదేవిధంగా మహారాష్ట్రాలో మిగిలిన ప్రాంతాలలో కంటే విదర్భలో తీవ్ర నీటిఎద్దడి, అన్ని రంగాలలో వెనుకబాటుతనం కనిపిస్తుంటుంది. నేను పొరబడి ఉండకపోతే ఆ కారణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొనే రాష్ట్రాల పునర్విభజన కమిటీ విదర్భని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఒకప్పుడు సిఫార్సు చేసినట్లు గుర్తు. కనుక విదర్భవాసుల కోరిక మన్నించి దానిని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుకొంటున్నాను. ఈ విషయంలో విదర్భకోసం పోరాడుతున్న వారికి మాపార్టీ మద్దతు ఇస్తుంది,” అని అన్నారు.
విదర్భ ప్రత్యేక రాష్ట్రం కోసం ముందుగా అక్కడి రాజకీయ పార్టీలు చొరవ తీసుకొంటే అప్పుడు ఆమె వాటికి మద్దతు పలికితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. పరిపాలనా వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడమే మంచిదని భాజపా కూడా నమ్ముతోంది. గతంలో భాజపా ప్రభుత్వ హయంలోనే మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి కనుక ఈ విషయంలో అది మళ్ళీ చొరవ తీసుకొన్నట్లయితే విదర్భ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం సాధ్యమే. కానీ కేంద్రప్రభుత్వానికి ఆ ఉద్దేశ్యం లేనప్పుడు విదర్భ కోసం జరుగుతున్న ఉద్యమాలకి తెరాస వంటి రాజకీయ పార్టీలు మద్దతు తెలుపడం వలన వాటిని మరింత రాజేసినట్లే అవుతుంది తప్ప మరే ప్రయోజనం ఉండదు.