బాబా పాటి రోషం కూడా మోడీ ప్రభుత్వానికి రాలేదే?

కాశ్మీర్ లో ఆర్మీ క్యాంప్ పై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 17మంది భారత్ జవాన్లు మృతి చెందడం, 30మందికి పైగా గాయపడటం పట్ల యావత్ భారతీయులు కుతకుతలాడిపోతున్నారు. అందుకు పాక్ పై తగిన ప్రతీకారం తీర్చుకోవలసిందేనని కోరుకొంటున్నారు. వివిద రంగాలకి చెందిన అనేకమంది ప్రముఖులు, శివసేన వంటి వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇక తమ సహచరులని కోల్పోయిన భారత్ సైనికులైతే పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వం అంగీకరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భాజపాకి చాలా పూజ్యనీయులైన యోగా గురువు బాబా రాందేవ్ మరో అడుగు ముందుకు వేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి భారత సేనలని పంపించి అక్కడ తలదాచుకొన్న ఉగ్రమూకలన్నిట్టినీ ఏరిపారేయాలని ట్వీట్ మెసేజ్ పెట్టారు. 

అయితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈరోజు ఉదయం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వేరేవిధంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని నిరూపించే అన్ని ఆధారాలని ప్రపంచ దేశాల ముందుంచి, పాకిస్తాన్ పై ఉగ్రవాద దేశమనే ముద్ర వేయించాలని నిర్ణయించారు. అందుకోసం నిన్న యూరిలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దొరికిన ఆధారాలతో సహా ఇంతవరకు భారత్ సేకరించిన ఆధారాలన్నిటినీ ప్రపంచ దేశాల ముందు ఉంచి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఏకాకి చేయాలని నిర్ణయించారు. 

అయితే ఇది కొండని తవ్వి ఎలుకని పట్టుకొన్నట్లే ఉందని చెప్పకతప్పదు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకి కేంద్రంగా ఉందనే సంగతి ప్రపంచ దేశాలన్నిటికీ ఎప్పుడో తెలుసు. ముంజేతి కంకణం చూసుకొనేందుకు మళ్ళీ అద్దం ఎందుకన్నట్లు పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని నిరూపించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి. అయినా భారత్-పాక్ గొడవలు మొగుడు-పెళ్ళాల గొడవ వంటివేనని చెప్పవచ్చు. కనుక ఆ గొడవలలో ప్రపంచదేశాలు తలదూర్చకపోవచ్చు. ఎందుకంటే అవి ఈరోజు కొత్తగా మొదలైనవేమీ కావు. అవి ఈనాటితో ముగిసేవి కావు క్లానుక. 

అదే ఏ అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి అగ్రరాజ్యాలకి ఇటువంటి కష్టం వచ్చిపడితే, అది ప్రపంచ దేశాల సమస్యగా..కష్టంగా భావించి అగ్రరాజ్యాలన్నీ చందాలు వేసుకొని మరీ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయడానికి సిద్దపడతాయి. కానీ భారత్ కి అది వర్తించదు. అగ్రరాజ్యాలతో సహా ప్రపంచ దేశాలన్నిటికీ దేని సమస్యలు దానికున్నాయి. కనుక భారత్ గోడు వినే తీరిక, ఆసక్తి వాటికి ఉండవు. భారత్ తో బారీ వ్యాపార లావాదేవీలున్న దేశాలు మాత్రం భారత్ తృప్తి కోసం పాకిస్తాన్ చర్యలని ఖండనతో సరిపెట్టవచ్చు. కనుక మోడీ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం పలాయనవాదంగానే భావించక తప్పదు. అందుకే పాక్ కూడా అన్నిసార్లు అంత సాహసానికి పూనుకోగలుగుతోందని చెప్పకతప్పదు. కనుక కనీసం రాందేవ్ బాబా చూపిన తెగువ అయినా మోడీ ప్రభుత్వం చూపగలిగితేనే పాక్ దూకుడుకి కళ్ళెం వేయడం సాధ్యం అవుతుంది.