కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి, 17మంది జవాన్లు మృతి

ఆదివారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బారాముల్లా జిలాలోని యూరిలోని ఆర్మీ క్యాంప్ పై జరిగిన ఉగ్రవాదులు దాడిలో 17మంది ఆర్మీ జవాన్లు చనిపోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ క్యాంప్ గల గుడారాలలో జవాన్లు నిద్రిస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్స్ విసురుతూ, ఎకె-47తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ విరుచుకు పడటంతో ఇంత ప్రాణనష్టం జరిగింది. సైనికులు నిద్రిస్తున్న గుడారాలకి మొదట నిప్పుపెట్టి, మంటలలో చిక్కుకొన్న సైనికులు పరుగులు పెడుతూ బయటకి రాగానే వారిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అనధికార సమాచారం. దాడి జరుగుతున్న సంగతి గ్రహించగానే క్యాంప్ లోని మిగిలిన సైనికులు ఉగ్రవాదులని చుట్టుముట్టి ఎదురు కాల్పులు ప్రారంభించారు. వారి మధ్య కొన్ని గంటలపాటు కాల్పులు కొనసాగాయి. చివరికి నలుగురు ఉగ్రవాదులని ఆర్మీ జవాన్లు మట్టుబెట్టారు.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “దాడికి పాల్పడిన వారు జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకి చెందినవారని అనుమానిస్తున్నాము. వారి వద్ద నుంచి  నుంచి పాకిస్తాన్ ముద్రలున్న ఎకె-47తుపాకులు, గ్రెనేడ్ లంచర్స్, ఇంకా అనేక తేలికపాటి అత్యాధునిక ఆయుధాలు లభించాయి. ఉగ్రవాదుల దాడిలో ఇంతమంది జవాన్లు చనిపోయినందుకు, గాయపడినందుకు చాలా బాధపడుతున్నాను,” అని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఈ దాడిని ఖండించారు. ఈ దాడికి కుట్ర చేసినవారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడిల చనిపోయిన జవాన్ల కుటుంబాలని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొంటుందని హామీ ఇచ్చారు. ఈ దాడి గురించి తెలుసుకొన్న హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన విదేశీపర్యటనని రద్దు చేసుకొని ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఇది ఖచ్చితంగా పాక్ ప్రేరేపిత దాడేనని ఆయన అన్నారు. రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ తక్షణమే కాశ్మీర్ చేరుకొని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. 

ఇదివరకు పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ,  హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ తదితరులు అందరూ కొన్ని రోజులపాటు ఇదేవిధంగా చాలా హడావుడి చేశారు. కానీ ఆ తరువాత దాని గురించి మాట్లాడటం తగ్గించేశారు. కనుక పాకిస్తాన్ కూడా ఇంకా దాని గురించి మాట్లాడటం మానుకొంది. ఈసారి కూడా బహుశః అదే జరుగవచ్చు. భారత్ పట్ల పాక్ వైఖరి ఎప్పుడు చాలా స్పష్టంగానే ఉంది కానీ పాక్ పట్ల భారత్ కే ఏనాడు నిర్దిష్టమైన వైఖరి, విధానాలు లేకుండా ముందుకు సాగుతోంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్ని నిందించి చేతులు దులుపుకొంటుంది. అందుకే పాకిస్తాన్ కూడా భారత్ హెచ్చరికలని చాలా తేలికగా తీసుకొని ఇంత సాహసానికి పూనుకోగలుగుతోందని భావించవచ్చు.