
కాశ్మీర్ లో చిచ్చు పెడుతున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక సరికొత్త వ్యూహం అమలుచేయడం మొదలుపెట్టారు. అదే..పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకొంటూ చాలా కాలంగా పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఆ దేశంలోని బలూచిస్తాన్ వేర్పటువాదులకి మద్దతు తెలపడం. సహజంగానే అందుకు వారు చాలా సంతోషించి, తమ పోరాటాలకి భారత్ మద్దతు తెలుపాలని, తమపై పాక్ సైనికులు చేస్తున్న ఆకృత్యాల గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలని, ఒకప్పుడు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ హయంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ ని విడదీయడానికి ఆ దేశానికి సహాయపడినట్లే, ఇప్పుడు బలూచిస్తాన్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించేందుకు భారత్ తమకీ సహాయపడాలని బలూచ్ వేర్పాటువాదులు కోరుతున్నారు.
బలూచ్ వ్యవహారంలో భారత్ వేలు పెట్టి పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. కానీ ఊహించని ఈ పరిమాణాలని చూసి పాక్ ఆగ్రహంతో ఊగిపోతోంది. బలూచ్ ప్రజలపై, ఉద్యమకారులపై తన సైనికుల చేత దాడులు చేయిస్తూ, నిత్యం డజన్ల కొద్దీ ప్రజలని ఎత్తుకుపోయి వారిని అతిపాశవికంగా హింసించి అతి కిరాతకంగా హత్యలు చేసి రోడ్ల మీద వారి శవాలు పడేయిస్తూ అందరినీ భయబ్రాంతులని చేస్తోందని ఆ ఉద్యమకారులే స్వయంగా భారత్ కి మోరపెట్టుకొంటున్నారు. అంతకు ముందు చాలా కాలం నుంచి పాక్ సైనికులు బలూచ్ లో మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతునే ఉన్నారు. భారత్ కలుగజేసుకొన్న తరువాత అదింకా పెరిగిపోయి పాక్ సైనికుల చేతిలో అనేకమంది ప్రజలు అన్యాయం ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగని భారత్ ప్రభుత్వం తన సైన్యాన్ని పంపించి వారిని ఆదుకోలేదు. కనుక బలూచ్ విషయంలో అది కలుగజేసుకోవడం కూడా తప్పే అవుతుంది.
కానీ పాకిస్తాన్ని కాశ్మీర్ కి దూరంగా ఉంచేందుకు బలూచ్ విషయంలో మోడీ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకొంది. బలూచిస్తాన్ వేర్పాటువాద నేతలకి భారత్ లో ఆశ్రయం కల్పించాలని నిర్ణయించింది. అలాగే బలూచ్ ప్రజల కోసం ఆకాశవాణి ఒక మల్టీ మీడియా వెబ్ సైట్ ని, ఒక మొబైల్ యాప్ ని మొన్న డిల్లీలో ప్రారంభించింది. వాటిద్వారా బలూచ్ ప్రజలు తమ బాధలని, పాక్ సైనికుల అక్రుత్యాలని ప్రపంచదేశాలకి తెలుపుకొనేందుకు వీలుకలుగుతుంది.
ఈ నిర్ణయాలు బలూచ్ వేర్పాటువాదులకి, ప్రజలకి చాలా సంతోషం కలిగించవచ్చు. భారత్ కూడా అందుకు భుజాలు చరుచుకోవచ్చు. కానీ ఈ కారణంగా బలూచ్ ప్రజలపై పాక్ సైనికులు ఇంకా రెచ్చిపోతే ఇంకా అనేక వేలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవా? అప్పుడు వారిని భారత్ కాపాడగలదా? భారత్ తన సైనికులని అక్కడికి పంపించి కాపాడగలిగితే తప్పకుండా మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధించవచ్చు . కానీ మోడీ ప్రభుత్వానికి ఆ ధైర్యం, ఉద్దేశ్యమే లేనప్పుడు వారికి అండగా నిలబడటం, ప్రోత్సహించడం కూడా తప్పేనని చెప్పక తప్పదు. పాకిస్తాన్ న్ని కాశ్మీర్ నుంచి దూరంగా ఉంచేందుకు అమలుచేస్తున్న వ్యూహం వలన అక్కడ బలూచ్ లో వేలాది మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోవలసి వస్తే అటువంటి వ్యూహాలు చాలా అమానవీయమైనవని చెప్పక తప్పదు. అంతకంటే భారత్ నేరుగా పాకిస్తాన్ని ఎదుర్కోవడమే మేలు కదా.