
ఒక్కోసారి రాహుల్ గాంధీకి మంచి స్క్రిప్ట్ రైటర్ దొరుకుతారో ఏమో తెలీదు కానీ తన ప్రత్యర్ధులపై అందరినీ ఆకట్టుకొనే మంచి పంచ్ డైలాగ్స్ విసురుతుంటారు. యూపిలో అలహాబాద్ నగరంలో రాహుల్ గాంధీ గురువారం పర్యటిస్తున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ని ఉద్దేశ్యించి, “ఆయన ఇప్పుడు తన సైకిల్ టైర్లు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ సైకిల్ ఎప్పుడో తుప్పు పట్టి పాడయిపోయింది,” అని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్ అందుకని.
“వచ్చే ఏడాది యుపి శాసనసభ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అఖిలేష్ యాదవ్ తన ప్రభుత్వానికి సరికొత్తరూపం కల్పించి ప్రజలని ఆకట్టుకోవాలనుకొంటున్నారు. కానీ చాలా ఆలస్యం చేశారు. ఇప్పటికే నాలుగున్నరేళ్ళు వృధా చేసేశారు. ఇప్పుడు కొంతమంది మంత్రులని అధికారులని అటూ ఇటూ మార్చినంత మాత్రాన్న ప్రభుత్వం రూపు రేఖలేమీ మారిపోవు,” అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వంలో కొందరు అవినీతిపరులపై అఖిలేష్ యాదవ్ చర్యలు తీసుకొంటున్నారు. అందుకే రాహుల్ గాంధీ ఆవిధంగా అన్నారు.
“దారి పక్కన పడున్న విద్యుత్ తీగని పొరపాటున తాకితే భయపడిపోనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడి విద్యుత్ తీగలలో ఎప్పుడూ విద్యుత్ ఉండదు,” అని రాహుల్ గాంధీ మరో పంచ్ డైలాగ్ కొట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రాహుల్ గాంధీ చక్కటి చురకలు వేశారు. “ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బడాబడా కార్పోరేట్ సంస్థలకి రూ.1.1 లక్షల కోట్లు మాఫీ చేశారు. కానీ నిరుపేదల రైతుల రుణాలు మాఫీ చేయడానికి మాత్రం ఎప్పుడూ వెనకాడుతుంటారు,” అని అన్నారు. రాహుల్ గాంధీ ఉద్దేశ్యం దేశంలో కార్పోరేట్ సంస్థలు బ్యాంకుల వద్ద లక్షల కోట్లు రుణాలు తీసుకొని చెల్లించకుండా ఎగవేస్తున్నా కూడా మోడీ పట్టించుకోరని కావచ్చు.
‘ప్రజలు అలసిపోయున్నారు..కానీ మోడీ కులాసాగా ఉన్నారు’ అని అర్ధం వచ్చే హిందీ పంచ్ డైలాగ్ ఒకటి కొట్టారు.
అందరినీ ఆకట్టుకొనే మంచి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కొట్టి రాహుల్ గాంధీ తన ప్రత్యర్దులని బాగానే విమర్శించారు. కానీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరా లేదా? అంటే అనుమానమే. అందుకే యూపిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే కాంట్రాక్ట్ ప్రశాంత్ కిషోర్ కి అప్పగించేశారనుకోవాలసి ఉంటుంది