
యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీలో జరుగుతున్న కుటుంబ కలాహాల కారణంగా ఆ పార్టీలో ముగ్గురు ప్రముఖులు రోడ్డున పడ్డారు. వారు సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్, ఆయన కొడుకు-రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయం తమ్ముడు మంత్రి-శివపాల్ యాదవ్. ములాయం సింగ్ తన తమ్ముడు మాటలు నమ్మి కొడుకు అఖిలేష్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేశారు. ఆ స్థానంలో తమ్ముడు శివపాల్ యాదవ్ ని అధ్యక్షుడుగా నియమించారు. అందుకు అఖిలేష్ తీవ్ర ఆగ్రహంతో చిన్నాన్న శివపాల్ యాదవ్ చేతిలో ఉన్న మూడు మంత్రిత్వ శాఖలని వెనక్కి తీసేసుకొన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కొడుకుని, తమ్ముడు మాటలు విని రాష్ట్ర అధ్యక్ష పదవిలో నుంచి చెప్పాపెట్టకుండా తొలగించడం ద్వారా, వారి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ని ములాయం సింగ్ స్వయంగా బహిరంగం చేసినట్లయింది. అప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా అంతే ధీటుగా ప్రతిస్పందించడం వలన ఆ కుటుంబంలో అంతః కలహాలు పతాకస్థాయికి చేరయనే సంగతి వారే స్వయంగా దృవీకరించుకొన్నట్లు అయింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో పార్టీలో, ప్రభుత్వంలో తను రగిలించిన చిచ్చుని ఆర్పేందుకు ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీ నుండి లక్నో చేరుకొన్నారు.
ఇంత రాద్దాంతం జరిగిన తరువాతైన పార్టీలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడం విచిత్రమే. అఖిలేష్ చేతిలో అవమానానికి గురైన శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రికి తన మంత్రుల శాఖల మార్పు చేయడానికి, మంత్రులని తొలగించడానికి పూర్తి అధికారాలున్న మాట వాస్తవమే. కానీ అందరూ కూడా పెద్దాయన (ములాయం సింగ్ యాదవ్)మాటకి కట్టుబడి ఉండాల్సిందే,” అని అన్నారు.
ములాయంకి తమ్ముడు వరసైన రామ్ గోపాల్ యాదవ్ కూడా వారి మధ్యలో దూరి అఖిలేష్ పక్షం తీసుకొని మాట్లాడారు. “కారణాలు ఏవైనప్పటికీ అఖిలేష్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం పెద్ద తప్పు. అయితే పార్టీలో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడటం వలన జరిగిన పొరపాటే తప్ప పార్టీలో మా మధ్య ఏవో భీకర యుద్ధాలు జరిగిపోతున్నాయని అనుకోనవసరం లేదు. పార్టీ అన్నాక అప్పుడప్పుడు ఇటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని సరిదిద్దుకొంటూ ముందుకు సాగాలి,” అని అన్నారు. అంటే ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ చేసింది చాలా తప్పు’ అని చెపుతునట్లు అర్ధం అవుతోంది.
ఈరోజు లక్నోలో ములాయం అధ్యక్షతన సమాజ్ వాదీ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరుగబోతోంది. దానిలో ఈ పోరాటాలకి ములాయం ముగింపు పెడతారో లేదా ఏవైనా ఊహించని కొత్త మలుపులు తిరుగుతాయో చూడాలి. ఏమైనప్పటికీ ప్రస్తుతం అధికార సమాజ్ వాదీ పార్టీలో జరుగుతున్న ఈ గొడవలన్నీ చూసి ప్రతిపక్షాలు చాలా సంతోషిస్తున్నాయి.