ఐసిస్ చెర నుంచి మన వాళ్ళు విడుదల

గత ఏడాది జూలై 29న లిబియాలో సిర్త్ అనే పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదుల చేతికి చిక్కిన ఇద్దరు ప్రొఫెసర్లు బలరాం కృష్ణ, టి. గోపాలకృష్ణ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా ట్వీటర్ ద్వారా వెల్లడించారు. వారిద్దరూ విడుదలయినందుకు చాలా సంతోషిస్తున్నానని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.

సిర్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా చేస్తున్న వారిద్దరూ గత ఏడాది సెలవుపై భారత్ కి బయలుదేరినప్పుడు వారిని సిర్త్ పట్టణంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. వారితో పాటు కర్నాటకకి చెందిన మరో ఇద్దరు ప్రొఫెసర్లని కూడా ఉగ్రవాదులు ఎత్తుకుపోయారు కానీ కొన్ని రోజుల తరువాత వారిద్దరినీ విడిచిపెట్టారు. తెలంగాణ కి చెందిన బలరాం కృష్ణ, ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి చెందిన గోపాలకృష్ణలని మాత్రం ఉగ్రవాదులు విడిచిపెట్టకపోవడంతో వారిక ప్రాణాలతో తిరిగివస్తారనే నమ్మకం పోయింది.

వారి విడుదల కోసం లిబియాలోని భారత్ దౌత్యాధికారులు ప్రయత్నిస్తునట్లు రెండు మూడు నెలలపాటు వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత క్రమంగా అవీ నిలిచిపోవడంతో వారిద్దరినీ ఐసిస్ ఉగ్రవాదులు చంపివేసి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అవి చూసి వారి కుటుంబ సభ్యులు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారో ఎవరూ ఊహించి ఉండరు.

ఆ తరువాత మళ్ళీ ఇంతవరకు వారి గురించి ఎటువంటి సమాచారం రాలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇవ్వాళ కొద్ది సేపటి క్రితమే వారిద్దరూ క్షేమంగా విడుదలయ్యారని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఏడాదిగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులకి ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. వారితో పాటు యావత్ దేశ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. వారి విడుదల కోసం ఇంత పట్టుదలగా కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, దౌత్యాధికారులనీ మనస్పూర్తిగా అభినందిద్దాము.