
రాష్ట్రంలో తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి చిరకాల స్వప్నం త్వరలో నెరవేరబోతున్నట్లు తాజా సమాచారం. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలని చాలా ఏళ్లుగా కలలు కంటున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలకి కృతజ్ఞతగా ఆయనకీ తప్పకుండా గవర్నర్ పదవి ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు ఆయనకు హామీ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి మోత్కుపల్లి గవర్నర్ పదవి కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు.
అప్పటి నుంచి ఆయన తన హుందాతనం కాపాడుకోవడం కోసం రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం కూడా తగ్గించుకొన్నారు. యదాద్రిని జిల్లాగా ప్రకటించాలని ఒకసారి ఆందోళన చేసి దానిని సాధించుకోగలిగారు. సుమారు రెండేళ్ళ నిరీక్షణ తరువాత చివరికి ఆయన కలలు ఫలించి అరుణాచల్ ప్రదేశ్ లేదా మణిపూర్ రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ఆ రాష్ట్ర గవర్నర్ జెపి రాజ్ ఖోవాని కేంద్ర ప్రభుత్వం పదవిలో నుంచి తొలగించి, తాత్కాలికంగా మేఘాలయ గవర్నర్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది.
కనుక మోత్కుపల్లిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికే గవర్నర్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆయన వివరాలని అడిగి తీసుకొంది. హోం మంత్రిత్వ శాఖ అధికారులు ప్రస్తుతం ఆయనతో ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంటే మోత్కుపల్లి గవర్నర్ కావడం దాదాపు ఖాయం అయినట్లే భావించవచ్చునేమో? త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనుకోవచ్చు.