
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేను-మనం-జనం అనే మరో పుస్తకాన్ని రాస్తున్నట్లు తాజా వార్త. దానికి ‘మార్పు కోసం యుద్ధం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారట. వచ్చే ఏడాది జనవరిలో అది విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పుస్తకంలో జనసేన పార్టీ ఆలోచనా విధానం ఏ విధంగా ఉండబోతోందో వివరించబోతున్నారట. మరో విధంగా చెప్పాలంటే అది జనసేన రాజ్యాంగం అని చెప్పుకోవాలేమో? కానీ పవన్ కళ్యాణ్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కనుక దాని గురించి మరీ ఎక్కువగా ఊహించుకోవడం కూడా అనవసరమే.
గతంలో ఆయన జనసేన పార్టీని ప్రకటించినప్పుడు ‘ఇజం’ అనే పేరుతో తాను రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. కనుక మళ్ళీ ఈ కొత్త పుస్తకం విడుదలకి కూడా అటువంటి వేదికనే ఎంచుకొంటే జనవరిలోనే ఆయన రాజకీయాలలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారని భావించవలసి ఉంటుంది. ఆయన రాసిన ఇజం పుస్తకంపై ఆయన అభిమాని రామ్ గోపాల్ వర్మ అంతటివాడు కూడా పెదవి విరిచాడు. ఆ పుస్తకంలో రెండు పేజీలు కూడా చదవి అర్ధం చేసుకోలేకపోయానని అన్నారు.
మరి పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్-ఇజం చదివారో లేదో? అర్ధమయిందో లేదో తెలియదు. కానీ వారి కోసం పవన్ మరో కొత్త పుస్తకం రాస్తున్నారు. సాధారణంగా ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపించాలనుకొంటే ముందుగా భావసారూప్యత, ఆ శక్తిసామర్ధ్యాలు ఉన్న కొంతమందితో కలిసి పార్టీని రూపొందించుకొంటారు. అందరూ కలిసి దాని మ్యానిఫెస్టో (రాజ్యాంగం) రచించుకొంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే కూర్చొని దానిని తయారుచేసుకోవడం విచిత్రంగానే ఉంది. అది తన జనసేన పార్టీకి సంబంధించింది కాకపోతే ఎవరూ వేలెత్తి చూపేవారు కాదు. కానీ అది పార్టీ (అంటే పవన్ కళ్యాణ్) ఆలోచన విధానాలని తెలియజేస్తుందని చెప్పడం వలనే ఇటువంటి విమర్శలు ఎదురవవచ్చు.