
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న గవర్నర్ నరసింహాన్ ని కలిసి దాదాపు గంటసేపు మాట్లాడారు. వారు ప్రత్యేక ప్యాకేజి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో మళ్ళీ మొదలైన పోరాటాలు, శాసనసభ సమావేశాలలో జరిగిన గొడవ వగైరా విషయాల గురించి మాట్లాడుకొన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
దసరా పండుగ రోజున చంద్రబాబు తన మంత్రివర్గ విస్తరణ చేసి దానిలోకి తన కొడుకు నారా లోకేష్ ని తీసుకోవాలనుకొంటున్నారని తెదేపా నేతలు, మంత్రులు చాలా కాలం క్రితమే మీడియాకి లీకులు ఇచ్చారు. దసరా పండుగ కూడా దగ్గర పడుతోంది కనుక లోకేష్ కి మంత్రి పదవి కట్టబెట్టడం గురించి ముఖ్యమంత్రి గవర్నర్ తో మాట్లాడి ఉండవచ్చునని మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి.
నిజం చెప్పాలంటే లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వడమే చాలా మంచిది లేకుంటే అతని భవిష్యత్ కూడా రాహుల్ గాంధీలా అయోమయంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ పాటు దేశాన్ని ఏలిన్నప్పుడు సోనియా గాంధీ తన ముద్దుల కొడుకుని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి, అతను కాలు మీద కాలేస్కుని దేశాన్ని ఏలేస్తుంటే చూసుకోవాలని చాలా ఆశపడ్డారు. కానీ రాహుల్ ఆ పదవిని చేపట్టేందుకు భయపడ్డారు. ఈలోపే మోడీ దానిని కబ్జా చేసేశారు. ఇప్పుడప్పుడే దానిని ఆయన ఖాళీ చేసే ఆలోచనలో లేనట్లే ఉన్నారు. ఇక చేసేదేమీ లేక రాహుల్ గాంధీ లోక్ సభ వెనుక బెంచీలలో హాయిగా కునుకు తీస్తూ, మెలకువ వచ్చినప్పుడు పాదయాత్రలు చేస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
ఏపిలో నారా లోకేష్ పరిస్థితి కూడా ఇంచుమించు ఆవిధంగానే ఉండటం విశేషం. అక్కడ రాహుల్ గాంధీకి మమ్మీ సపోర్ట్ చేస్తే ఇక్కడ లోకేష్ కి డాడి సపోర్ట్ చేస్తున్నారు అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్. చంద్రబాబు ఎంతగా పుష్ చేస్తున్నా లోకేష్ బండి స్టార్ట్ అవడం లేదు. గ్రేటర్ ఎన్నికలలో తెదేపా తరపున ప్రచారం చేసారు కానీ అచ్చం రాహుల్ గాంధీ లాగే ఫెయిల్ అయిపోయారు. అదే సమయంలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ తన సత్తా చాటుకొని తెరాసలో, తెలంగాణ ప్రభుత్వంలో తన స్థానం సుస్థిరం చేసుకొన్నారు.
ఇప్పటికే రెండున్నరేళ్ళు పూర్తయిపోయింది. వచ్చే ఎన్నికల తరువాత మళ్ళీ తెదేపా అధికారంలోకి వస్తుందో లేదో డౌటే! కనుక ఇప్పటికైనా లోకేష్ బాబుని మంత్రి పదవి కట్టబెట్టకపోతే ఆనక ఆయన కూడా మరో రాహుల్ గాంధీలా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ దసరాకి మంత్రి పదవి గ్యారంటీ అని తెదేపా నేతలు భావిస్తున్నారు.
మిగిలిన ఈ రెండేళ్ళలో లోకేష్ తన సత్తా చాటుకోగలిగితే అందరికీ సంతోషమే. కానీ వచ్చే ఎన్నికలలో ఒకవేళ తెదేపా ఓడిపోతే అప్పుడు లోకేష్ గురించి మీడియా మాట్లాడవలసివచ్చినప్పుడు మాజీ మంత్రి లోకేష్ అని చెపుతుంటుంది. ఆ విధంగానైనా సంతృప్తిపడవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఆ భాగ్యం కూడా దక్కలేదు కదా?