పోరాటం కావేరి జలాల కోసమా మరేదైనా?

కావేరీ నదీ జలాల పంపకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కర్నాటక రాష్ట్రంలో రేగిన చిచ్చు తమిళనాడుకి కూడా పాకి ఆ రెండు రాష్ట్రాలని దహించి వేస్తోందిప్పుడు. రెండు రాష్ట్రాలలో వందలాది బస్సులు, ఇతర వాహనాలు, దుకాణాలు, హోటల్స్ ఆందోళనకారుల చేతిలో కాలి బూడిదైపోతున్నాయి. సుప్రీంకోర్టు తన ఆదేశాలని కొంచెం సవరించుకొన్నప్పటికీ ఆందోళనలు ఇంకా ఉదృతం అవుతున్నాయే తప్ప ఆగడం లేదు. కర్నాటకలో తమిళనాడుకి చెందిన వాహనాలు, హోటల్స్, దుకాణాలపై దాడులు జరుగుతుంటే, తమిళనాడులో కర్నాటకకి చెందిన ఆస్తులు, వాహనాలపై దాడులు జరుగుతున్నాయి. 

రెండు రాష్ట్రాలలో జరుగుతున్న విద్వంసం చూస్తుంటే, అది నిజంగానే కావేరీ జలాల కోసమే జరుగుతున్నదా లేకపోతే వాటి వెనుక రాజకీయ, వ్యాపార కుట్రలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే నదీ జలాల పంపకాల కోసం గతంలో కూడా ఆ రెండు రాష్ట్రాలు చాలాసార్లు గొడవ పడ్డాయి. రెండు రాష్ట్రాలలో ఆందోళనలు జరిగాయి. కానీ ఏనాడూ ఇంత విధ్వంసం జరగలేదు. నీళ్ళ కోసమే ఇంత విద్వంసం జరుగుతోందంటే నమ్మశక్యంగా లేదు. నదీ జలాల కోసం కాక ఆ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలకి అప్రదిష్ట కలిగించేందుకే ఎవరో తెర వెనుక కుట్రలు పన్నుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఈ కుట్రల గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తే ఏదో ఒక రాజకీయ పార్టీని వేలెత్తి చూపించవలసిరావచ్చు. అది ఊహించని కొత్త సమస్యలు తేవచ్చు కనుక ఇక్కడి వరకు మాత్రమే ఆలోచించి ఆగిపోక తప్పదు.

ముఖ్యంగా కర్నాటక నుంచి తమిళనాడుకి కావేరీ జలాలు అందుతున్నా కూడా నిరసనల పేరిట ఇంత విధ్వంసం జరుగుతోందంటే ఖచ్చితంగా దాని వెనుక ఎవరో కుట్రలు పన్నుతున్నారని అనుమానించక తప్పదు. కర్నాటకలో ఆందోళనకారులు ఇంతగా రెచ్చిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి ఈ సమస్య గురించి లేఖలు రాసి వారి సహకారం కోరారు.

నదీ జలాల కోసం ఆందోళనల పేరిట రెండు రాష్ట్రాలలో జరుగుతున్న విధ్వంసం చూస్తుంటే ప్రజలలో సంకుచిత భావాలు పెరుగుతూ క్రమంగా జాతీయభావం కనుమరుగైపోతోందే..అని ఆవేదన కలుగుతోంది. రెండు నెలలుగా కాశ్మీర్ రావణకాష్టంలా రగులుతోంది. దానికి వేర్పాటువాదులు, పాకిస్తాన్ ప్రభుత్వమే కారణం అని తెలుసు. కనుక వారిని నిందించగలుగుతున్నాము. కానీ దక్షిణాదిన గొప్ప సంస్కృతి సంప్రదాయాలకి నిలయమని పేరు గాంచిన రెండు రాష్ట్రాలలో రగులుతున్న ఈ చిచ్చుకి ఎవరిని నిందించాలి?