
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటన చేసి మళ్ళీ తేనె తుట్టెని కదిలించారు. ఊహించినట్లుగానే వైకాపా ఆలస్యం చేయకుండా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఏపి బంద్ కి పిలుపునిచ్చింది. ఏపిలో ప్రతిపక్షాలు కూడా అందుకు ‘సై’ అనడంతో బంద్ విజయవంతంగా జరుగుతోంది. ఈరోజు సాయంత్రం బంద్ పూర్తవగానే జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ని తన ఖాతాలో ఎలాగూ జమ చేసుకోవడం ఖాయం. ఈ విషయంలో తెదేపా ఆయనని నిలువరించలేకపోయిందనే చెప్పవచ్చు.
సరిగ్గా ఇదే సమయంలో ఏపి శాసనసభ సమావేశాలు కూడా జరుగుతుండటంతో వైకాపాకి ఇంకా కలిసి వచ్చింది. కేవలం మూడు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించినప్పటికీ, వైకాపా ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఒక్కరోజు కూడా సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడ్డారు. జి.ఎస్.టి.బిల్లుకి అనుకూలంగా తీర్మానం ఆమోదించుకోవడానికి మొదటి రోజు వారిని సభ నుంచి సస్పెండ్ చేయవలసి వచ్చింది. ఈరోజు కూడా వారు సభలో చేసిన హడావుడి కారణంగా స్పీకర్ కోడెల సభని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
శాసనసభలో, బయటా కూడా తెదేపా ప్రభుత్వాన్ని వైకాపా చాలా ఇబ్బంది పెట్టగలిగింది. ముఖ్యంగా శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చకి తెదేపా ప్రభుత్వం భయపడుతోందనే సంగతి ప్రజలకి అర్ధమయ్యేలా చేయగలిగింది. కానీ సభలో ఆ పార్టీ సభ్యులు చాలా అనుచితంగా వ్యవహరించడం వలన రాష్ట్ర ప్రజల దృష్టిలో అది కూడా చాలా చెడ్డపేరు మూటగట్టుకొంది. అందుకు అది బాధపడక పోవచ్చు కానీ చివరి నిమిషంలో తెదేపా తమని చావు దెబ్బకొడుతుందని ఊహించకపోవడంతో, అది ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడం వైకాపాకి కొంచెం కష్టమే.
శాసనసభని నిరవధిక వాయిదా వేసే ముందు ఆ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సభలో అనుచితంగా వ్యవహరించిన వైకాపా సభ్యులు అందరినీ మూడేళ్ళపాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా సభ దానిని ఆమోదించింది. శాసనసభలో వైకాపా సభ్యుల ప్రవర్తించిన తీరుని మొదటి రోజు నుంచే తెదేపా ప్రభుత్వం వీడియో రికార్డింగ్ కూడా చేయిస్తోంది. అయినా వైకాపా సభ్యులెవరికీ అనుమానం కలుగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వీడియో రికార్డింగుని, శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని శాసనసభ హక్కుల సంఘానికి పంపిస్తారు. దానిని ఆమోదించడం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. అంటే వైకాపా సభ్యులు అందరూ మిగిలిన రెండున్నరేళ్ళు శాసనసభలో అడుగు పెట్టవలసిన అవసరం లేదన్న మాట. ఒకవేళ కోర్టుకి వెళితే ప్రభుత్వం చేతిలో వీడియో రికార్డింగ్ ఉండనే ఉంది. పాపం వైకాపా.. తెదేపాని దెబ్బతీయబోయి తనే ఇలా దెబ్బయిపోయిందేమిటో.