పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే కదా!

పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ పట్ల సానుకూల వైఖరితో మాట్లాడటం చాలా హర్షణీయం. ఆయన మాటలలో రాష్ట్ర విభజన జరిగినందుకు చాలా బాధ వ్యక్తం అయినప్పటికీ, అదే సమయంలో తెలంగాణ పట్ల తనకున్న మమకారం కూడా ప్రతీ మాటలో కనబడింది. రజాకార్ల అకృత్యాలు వగైరా అప్రస్తుత అంశాలు, ఆయన చెప్పిన చరిత్ర పాఠాలు అభిమానులకి సరిగ్గా ఎక్కకపోయినా, ఆయన పాడిన తెలంగాణ పాటకి మంచి స్పందన వచ్చింది. కాకపోతే ఆ పాటలో ప్రతీ పదంలో వ్యక్తం అవుతున్న ఆవేదనని అర్ధం చేసుకోకుండా అభిమానులు కేరింతలు కొట్టడమే చాలా హాస్యాస్పదంగా ఉంది.

ఇక తెలంగాణా ఉద్యమాల సమయంలో తను, ఆంధ్రా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, సమస్యల గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వాస్తవమే అయినప్పటికీ అటువంటి మహోద్యమంలో అటువంటివన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న అనేక ఉద్యమాలని చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సహా తెలంగాణ లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు అందరూ ఎప్పటిలాగే ప్రశాంతంగా జీవిస్తున్నారు. నేటికీ పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లతో సహా సినీ ప్రముఖులు అందరూ తెలంగాణ లో హాయిగా జీవిస్తూ నిశ్చింతగా తమ సినీ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకొంటున్న సంగతి కూడా ఆయన చెప్పి ఉండి ఉంటే బాగుండేది.

ఇక హైకోర్టు విభజన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హర్షణీయం. ఒకప్పుడు తెలంగాణ ఇవ్వకుండా, ఇప్పుడు హైకోర్టు ఏర్పాటు చేయకుండా, ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రజలని చాలా చులకనగా చూస్తోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ఆయన ‘ఉత్తరాది అహంకారం’ అని పేరు పెట్టడం ఆలోచింపజేస్తోంది. తెలుగు ప్రజలు కాంగ్రెస్, భాజపాలని నెత్తిన పెట్టుకొని ఎంతగా మోసినా ఆ రెండు పార్టీలకి తెలుగు ప్రజలంటే చాలా చులకన అని పదేపదే నిరూపిస్తున్నాయి. అందుకు ఉత్తరాది అహంకారమే కారణం అన్న పవన్ కళ్యాణ్ వాదన సహేతుకమే.

ఆ అహంకారం వలనే తెలుగు ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింది. ఆ కారణంగానే తెదేపా, తెరాస, వైకాపా, జనసేన వంటి పార్టీలు పుట్టాయి. అయినా ఆ రెండు జాతీయ పార్టీలు నేటికీ తమ ఉత్తరాది అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. అందుకే హైకోర్టు విభజన, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి అంశాలని చాలా తేలికగా తీసుకొని నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్లు ఆంధ్రా, తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడుతున్నాయి. ఆ విధంగా ఆడినందుకు కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు ఏ గతి పట్టించారో తెలిసినా భాజపా కూడా అదే విధంగా వ్యవహరిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తుంది.

హైకోర్టు విభజన కోసం తెలంగాణాలో ఉవ్వెత్తున ఉద్యమాలు మొదలయ్యి రాష్ట్రంలో న్యాయవ్యవస్థ దాదాపు స్తంభించిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా హడావుడి చేసింది. కానీ ఆ తరువాత మళ్ళీ దానిని పట్టించుకోవడం మానేసింది. అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తే తప్ప పనులు జరుగవా? అనే అనుమానం కలుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో ఏపితో కూడా అదే విధంగా వ్యవహరించి కొరివితో తలగోక్కొంటోంది. అందుకే ఇవ్వాళ ఆ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలకి సిద్ధం అవుతున్నారు.

హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు, న్యాయమూర్తులు రోడ్లెక్కి ఉద్యమాలు చేయవలసి రావడం కేంద్ర ప్రభుత్వం అప్రదిష్టగా భావిస్తున్నట్లు లేదు. అందుకే అంత నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. కనుక మళ్ళీ ఏదో ఒకరోజు వారు రోడ్లెక్కక తప్పదేమో?