
వచ్చే ఏడాది జరుగనున్న యూపి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విధిలేని పరిస్థితులలో ఒంటరి పోరాటానికి సిద్ధం అయినప్పుడు, ఊహించని విధంగా ఒక బలమైన దోస్త్ దొరికాడు. అతనెవరో కాదు సాక్షాత్ యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చాలా మంచి వ్యక్తి, మానవతావాది అని రెండు సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ కూడా అఖిలేష్ యాదవ్ కి అటువంటి సర్టిఫికేటే ఒకటి ఇచ్చారు.
అంటే ఫేస్ బుక్ భాషలో చెప్పుకోవాలంటే ‘అఖిలేష్ యాదవ్ అండ్ రాహుల్ గాంధీ ఆర్ ఫ్రండ్స్ నౌ” అని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్, అధికార సమాజ్ వాదీ పార్టీలు పొత్తులు కుదుర్చుకోవడానికి ఇది ఇంకా మొదటి స్టెప్పే కనుక ఈ విధంగా రెండు పార్టీలు మరికొన్ని కాంప్లిమెంటరీలు ఇచ్చి పుచ్చుకోవలసి ఉంటుంది. అఖిలేష్ యాదవ్ నుంచి ఇటువంటి బంపర్ ఆఫర్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఒడ్డున పడినట్లే అని భావించవచ్చు. కానీ ఆ రెండు పార్టీల మధ్య ఇంకా సీట్స్ షేరింగ్ డీల్ కన్ఫర్మ్ అయ్యేవరకు కొంత ఊగిసలాట తప్పదు.
అఖిలేష్ యాదవ్ పాలనపై స్వయంగా ఆయన తండ్రి ములాయం సింగే చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనుక రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారనుకోవడానికి లేదు. ఈ సంగతి గ్రహించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. అందుకోసం ఆమె మైనార్టీలు, దళితుల ఓటు బ్యాంక్ లని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులు, బీసి, మైనార్టీ ఓటు బ్యాంకులకి గాలం వేస్తోంది. అందుకే 83 ఏళ్ల వయసున్నప్పటికీ బ్రాహ్మణ కులానికి చెందిన షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడింది. ఇంకా భాజపా పూర్తిగా రంగంలో దిగలేదు కానీ అది కూడా దళిత ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టాలని ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టేసింది.
పైగా భాజపా తరపున కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దింపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ ముగ్గురూ రంగంలోకి దిగినట్లయితే వారిని, మాయావతిని తట్టుకోవడం అఖిలేష్ యాదవ్ ఒక్కడి వల్ల కాదు. పైగా తన పాలన పట్ల ప్రజలలో వ్యతరేకత ఏర్పడిందనే సంగతి అఖిలేష్ యాదవ్ కి కూడా బాగానే అర్ధం అయినట్లుంది. అందుకే రాహుల్ గాంధీతో ఫ్రెండ్ షిప్ కి సిద్ధం అయ్యినట్లున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అదృష్టమనుకోవాలి.